Honeytrap: పాక్‌ మహిళ మాయలో ఆర్మీ ఉద్యోగి.. కీలక సమాచారం లీక్‌!

పాకిస్థాన్‌ మహిళ విసిరిన వలపు వల (హనీట్రాప్‌)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్‌ చేశాడన్న ఆరోపణలపై ....

Published : 22 May 2022 01:48 IST

* సైనికుడిని అరెస్టు చేసిన రాజస్థాన్‌ పోలీసులు

దిల్లీ: పాకిస్థాన్‌ మహిళ విసిరిన వలపు వల (హనీట్రాప్‌)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్‌ చేశాడన్న ఆరోపణలపై ఓ ఆర్మీ ఉద్యోగి అరెస్టయ్యారు. 24ఏళ్ల ప్రదీప్‌ కుమార్‌ హనీట్రాప్‌కు గురై సైన్యానికి సంబంధించిన సమాచారం లీక్‌ చేసినట్టు ఆరోపణలు రావడంతో రాజస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. జోధ్‌పూర్‌లో పనిచేస్తున్న కుమార్‌కు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐకి చెందిన మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. తనను తాను మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ హిందూ మహిళగా చెప్పుకొంది. తన పేరు చద్దాం అని.. బెంగళూరులోని ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు అతడిని నమ్మించింది. అలా పరిచయమైన కొన్ని నెలల తర్వాత కుమార్‌ పెళ్లి పేరు చెప్పి దిల్లీకి రావడం.. భారత సైన్యానికి చెందిన రహస్య దస్త్రాలు అడగడం వంటివి చేసినట్టు పోలీసులు తెలిపారు. అలా సేకరించిన సైనిక, వ్యూహాత్మక ప్రాముఖ్యతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఫొటోల ద్వారా ఆమెకు వాట్సాప్‌లో చేరవేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

ఆరు నెలల క్రితం వీరిద్దరూ వాట్సాప్‌లో కనెక్ట్‌ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్‌ డీజీ ఉమేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. కుమార్‌ వాట్సాప్‌లో కొన్ని డాక్యుమెంట్‌లను ఆమెకు షేర్‌ చేసినట్టు తెలిపారు. ఇతర సైనికుల్ని కూడా ఇందులో బలిపశువుని చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ నేరంలో కుమార్‌ స్నేహితురాలైన మరో మహిళ ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం కుమార్‌ను ఈ నెల 18న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శనివారం అతడిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని