Delta Fear: ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు!

డెల్టా వేరియంట్‌తో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి.

Updated : 26 Jun 2021 13:23 IST

డెల్టా భయంతో వణుకుతున్న ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌

సిడ్నీ: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు మాత్రం వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగాయి. అంతేకాకుండా అక్కడ వ్యాక్సిన్‌ పంపిణీని వేగంగా చేపడుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్‌ మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. సిడ్నీలో వారంపాటు లాక్‌డౌన్‌ విధించారు. డెల్టా వేరియంట్‌ ఆఫ్రికాలోనూ విలయం సృష్టిస్తున్నట్లు అక్కడి సీడీసీ వెల్లడించింది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌ దాటికి భారత్‌ కూడా వణికిపోయిన విషయం తెలిసిందే.

సిడ్నీలో లాక్‌డౌన్‌..

కరోనా నుంచి కోలుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌ ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. దీంతో సిడ్నీలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవారం పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. ఆస్ట్రేలియాలో గతవారంలోనే 65 పాజిటివ్‌ కేసులను గుర్తించారు. కరోనా మహమ్మారి బయటపడిన తర్వాత అత్యంత భయంకరమైన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని న్యూసౌత్‌వేల్స్‌ ప్రీమియర్‌ గ్లాడీస్‌ బెరెజిక్లెయిన్‌ పేర్కొన్నారు.

ఇండోర్‌లోనూ మాస్కులు: ఇజ్రాయెల్‌

ప్రపంచంలో అత్యధిక వేగంగా టీకా పంపిణీ చేస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్‌ ముందున్న విషయం తెలిసిందే. దీంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇండోర్‌ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పదిరోజుల క్రితం ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న నాలుగు రోజులకే నిత్యం వంద కేసులు బయటపడడం మొదలయ్యింది. కేవలం గురువారం ఒక్కరోజు 227 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌, మాస్కుల నిబంధన సడలింపును ఎత్తివేసింది. ఇండోర్‌ ప్రాంతంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిస్థితిని బట్టి మరిన్ని ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. దేశంలో వైరస్‌ విజృంభణకు డెల్టా వేరియంట్‌ కారణం కావచ్చని ఇజ్రాయెల్‌లో కరోనాపై ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్ పేర్కొన్నారు.

ఫిజీలోనూ అదే తీరు..

కరోనా వైరస్‌ వెలుగు చూసిన తొలినాళ్లలో మహమ్మారిని కట్టడి చేయడంలో ఫిజీ విజయం సాధించింది. గడిచిన ఏడాది కాలంగా అక్కడ పాజిటివ్‌ కేసుల జాడ కనిపించలేదు. కానీ, తాజాగా అక్కడి కొవిడ్‌ ఉద్ధృతి మళ్లీ మొదలయ్యింది. గురవారం ఒక్కరోజే 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏప్రిల్‌ నెలలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌తో మళ్లీ విజృంభణ మొదలైనట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఫిజీ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో మరోసారి కొవిడ్ కట్టడి ఆంక్షలకు ఉపక్రమించారు.

ఆఫ్రికాలో థర్డ్‌వేవ్‌..

డెల్టా వేరియంట్‌ ఉద్ధృతితో ఆఫ్రికా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 14 దేశాల్లో ఈ వేరియంట్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా గడిచిన మూడు వారాలుగా వైరస్‌ విజృంభణ మరింత ఎక్కువైనట్లు ఆయా దేశాలు వెల్లడిస్తున్నాయి. ఆఫ్రికా ఖండాన్ని మూడో వేవ్‌ తాకిందని ఆఫ్రికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్‌ జాన్‌ కెంగాసాంగ్‌ వెల్లడించారు. ఈ ధఫా విజృంభణతో మరింత దారుణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్‌ ప్రభావం కాంగో, ఉగాండాలో మరింత ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని