Azadi Ka Amrit Mahotsav: మేడిన్‌ బ్రిటిష్‌ ఇండియా..

నేటి ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదం... బ్రిటిష్‌ పాలనలోనూ దేశంలో మారుమోగింది. ఆంగ్లేయ జాత్యహంకారం రగిల్చిన కసి నుంచి ఎంతో మంది భారతీయులు విదేశీ వస్తువులకు పోటీగా రంగంలోకి దిగారు. స్వదేశీ వస్తువుల తయారీ ఆరంభించారు. సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల... బల్బ్‌, సిరా, బిస్కట్‌... ప్రతి దాని వెనకా స్వదేశాభిమానమే నడిపించింది.

Updated : 22 May 2022 09:03 IST

నేటి ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదం... బ్రిటిష్‌ పాలనలోనూ దేశంలో మారుమోగింది. ఆంగ్లేయ జాత్యహంకారం రగిల్చిన కసి నుంచి ఎంతో మంది భారతీయులు విదేశీ వస్తువులకు పోటీగా రంగంలోకి దిగారు. స్వదేశీ వస్తువుల తయారీ ఆరంభించారు. సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల... బల్బ్‌, సిరా, బిస్కట్‌... ప్రతి దాని వెనకా స్వదేశాభిమానమే నడిపించింది.

కరెంటు లేని కాలంలో కలకత్తాలో గ్యాస్‌ దీపాలు వాడేవారు. 1879లో ఇంగ్లాండ్‌ కంపెనీ ఒకటి వచ్చి ఎలక్ట్రిక్‌ బల్బ్‌లను పరిచయం చేసింది. 1895లో ఆంగ్లేయ సర్కారు కలకత్తా ఎలక్ట్రిక్‌ లైటింగ్‌ చట్టం తీసుకొచ్చింది. తర్వాత కొన్నాళ్లకు ఫిలిప్స్‌ రంగంలోకి వచ్చి... కలకత్తా మార్కెట్‌ను ఆక్రమించింది. అయితే... యూరోపియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో... అదీ వీధుల్లో మాత్రమే లైట్లు ఉండేవి. భారతీయులకు ముఖ్యంగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేవి కావు. అసలే స్వదేశీ ఉద్యమం సాగుతున్న వేళ... మార్కెట్‌లో డిమాండ్‌ కూడా ఉండటంతో... బెంగాల్‌కు చెందిన ముగ్గురు మిత్రులు... సురేన్‌, కిరణ్‌, హేమన్‌ రేలు కలసి 1930లో బెంగాల్‌ ఎలక్ట్రిక్‌ ల్యాంప్‌ వర్క్స్‌ను స్థాపించారు. జమీందారీ కుటుంబ నేపథ్యంతో విదేశాల్లో చదువుకొని వచ్చిన వీరు అప్పటికే జాదవ్‌పుర్‌ కాలేజీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. యూరోపియన్లకు పోటీగా... మధ్యతరగతి భారతీయుల ఇళ్లలోనూ వెలుగులు నింపాలనే ఉద్దేశంతో... దీన్ని ప్రారంభించారు. నాణ్యమైన బెంగాల్‌ బల్బ్‌లు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. స్వదేశీ ఉద్యమ ప్రభావంతో అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఎంతగా అంటే డిమాండ్‌ను తట్టుకోవటానికి జాదవ్‌పుర్‌లో కొత్తగా ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చేంతగా!


‘టెర్రరిస్టు’... దాస్‌ మార్గో సబ్బు!

బ్రిటిష్‌ సర్కారు పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత... ఆంగ్లేయ ఉత్పత్తులు భారత్‌పై విరుచుకుపడ్డాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా విదేశీ ఉత్పత్తిని వాడాల్సిన పరిస్థితి. స్వదేశీ అభిమానం ఉన్నా దేశీయంగా ఉత్పత్తి లేని అశక్తత. ఈ నేపథ్యంలో... దూసుకొచ్చిన ఓ పేరు ఖగేంద్రచంద్ర దాస్‌! కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాల నుంచి చదువు పూర్తయ్యాక శిబ్‌పుర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు దాస్‌. ఉద్యోగం చేస్తూనే జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆగ్రహించిన ఆంగ్లేయ సర్కారు ఆయనను అరెస్టు చేయటానికి రంగం సిద్ధం చేసింది. ఈ విషయం తెలిసిన ఆయన తండ్రి... కుమారుణ్ని ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లమన్నారు. కానీ ఆంగ్లేయులంటే ఇష్టం లేని దాస్‌... లండన్‌ కాకుండా అమెరికా వెళ్లారు. స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకొన్నారు. జపాన్‌ వెళ్లి అక్కడి సాంకేతికతను పరిశీలించి భారత్‌కు వచ్చి 1916లో కలకత్తా కెమికల్‌ కంపెనీని స్థాపించారు. ప్రాచీన భారతీయ వేపను ఉపయోగించి మార్గో సబ్బు, టూత్‌పేస్టుల తయారీ ఆరంభించారు. తక్కువ ధరకు లభించే ఈ సబ్బు ఆంగ్లేయ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని దెబ్బతీసి... స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ ప్రవేశించింది. అందుకే... దాస్‌ను ఆంగ్లేయ సర్కారు ‘ఆర్థిక టెర్రరిస్టు’గా పరిగణించేది.


పేరు మరచిపోతే... పార్లే అయ్యింది!

పొద్దున సాయంత్రం... వేడివేడి చాయ్‌లో ఒకటో రెండో బిస్కెట్లు నంజుకుంటూ రాజసం ఒలకబోసే యూరోపియన్లకు దీటుగా... భారతీయుల ఆస్వాదనకు వచ్చిందే స్వదేశీ పార్లే బిస్కెట్‌! విదేశాల నుంచి దిగుమతయ్యే బిస్కెట్లు ఉన్నత వర్గాలు, యూరోపియన్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. బొంబాయికి చెందిన చౌహాన్‌ సిల్క్‌ వ్యాపార కుటుంబం బేకరీ వ్యాపారం ఆరంభించింది. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో... ఇర్లా-పార్లా గ్రామాల మధ్య...  12 మంది సిబ్బందితో ఫ్యాక్టరీ పెట్టారు. కుటుంబ సభ్యులంతా కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా ఫ్యాక్టరీలో పనిచేయటం మొదలెట్టారు. ఎంతగా భాగస్వాములయ్యారంటే... కంపెనీ పేరు పెట్టడం మరచిపోయేంతగా! చివరకు ఏదీ తట్టకుంటే... ఆ ప్రాంతం... పార్లే పేరే స్థిరపడి పోయింది. తొలుత నారింజ పిప్పర్‌మెంట్లతో మొదలెట్టి బిస్కెట్‌ల తయారీలోకి దిగారు. పార్లే బిస్కెట్‌ సామాన్య భారతీయుల ఇళ్లను ముంచెత్తింది. ప్రపంచయుద్ధ సమయంలో... బ్రిటిష్‌ సిపాయిలు కూడా పార్లేనే కోరుకోవటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని