ల్యాబ్‌ లీకా? ఎలా నమ్మారో జనం: బ్యాట్ ఉమన్‌ 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ముమ్మాటికీ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకైందనే వాదనలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాబ్‌ లీక్‌ వివాదంలో ముందు

Updated : 15 Jun 2021 14:56 IST

వుహాన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ముమ్మాటికీ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకైందనే వాదనలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాబ్‌ లీక్‌ వివాదంలో ముందు నుంచి కేంద్రబిందువుగా మారిన చైనా ప్రముఖ వైరాలజిస్టు, బ్యాట్‌ ఉమన్‌ షీ ఝెంగ్లీ ఎట్టకేలకు ఈ వాదనలపై స్పందించారు. అయితే యథావిధిగా ల్యాబ్‌ నుంచి ఎలాంటి వైరస్‌ లీక్‌ కాలేదని చెప్పడం గమనార్హం. వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీకయిందనేందుకు బలమైన ఆధారాలు బయటపడుతుండటంతో తమ బండారం బయటపడకుండా చైనా యంత్రాంగం బ్యాట్‌ఉమెన్‌ను రంగంలోకి దించినట్టు పాశ్చాత్య నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. తాజాగా ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. కరోనా విపత్తుకు తమ సంస్థ కారణం కాదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌కు అరుదైన ఇంటర్వ్యూ ఇచ్చారు. మూములుగా చైనా శాస్త్రవేత్తలు గానీ అధికారులు గానీ మీడియాతో మాట్లాడేందుకు సాహసించరు. అయితే బ్యాట్‌ఉమన్‌ ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక ప్రభుత్వ యంత్రాంగం ఉందని అనుమానాలు కలుగుతున్నాయి.

‘‘అసలు ఈ భూమ్మిద రుజువులే లేనిదానికి సాక్ష్యాలు ఇస్తానని నేనెలా చెప్పగలను? అమాయకమైన శాస్త్రవేత్తలపై ప్రపంచం ఎలా దుమ్మెత్తిపోయగలుగుతుందో నాకు అర్థం కావట్లేదు’’ అని షీ ఝెంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్‌ల సామర్థ్యాన్ని పెంచే గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌ ప్రయోగాలను వుహాన్‌ ల్యాబ్‌ ఎన్నడూ జరపలేదని, అలాంటి వాటికి సహకారం కూడా అందించలేదని చెప్పారు. వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ ఉన్న గబ్బిలాలపై తన ప్రయోగాలు.. గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌ లాంటివి కావని, ఎందుకంటే వైరస్‌ను మరింత ప్రమాదరకంగా మార్చే పరిశోధనలేవీ తాను చేయలేదని తెలిపారు. కేవలం ఈ వైరస్‌ రకాలు ఒక జీవి నుంచి మరో జీవికి ఎలా వ్యాపిస్తాయో తెలుసుకునేందుకు మాత్రమే ప్రయోగాలు జరిపామన్నారు.

మరోవైపు కరోనాకు ముందు 2019 నవంబరులో వుహాన్‌ ల్యాబ్‌లోని కొందరు అనారోగ్యానికి గురైనట్లు వచ్చిన వార్తలను కూడా ఝెంగ్లీ తోసిపుచ్చారు. తమ ల్యాబ్‌లో అలాంటి కేసులేమీ వెలుగుచూడలేదని చెప్పిన ఆమె.. ‘‘సాధ్యమైతే ఆ సిబ్బంది పేర్లు చెప్పండి మేం చెక్‌ చేస్తాం’’ అని చెప్పారు. కరోనా మూలాలపై దర్యాప్తులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా తమ ల్యాబ్‌ పూర్తి సహకారం అందించిందని ఆమె అన్నారు. తమపై ఉన్న అపనమ్మకం కారణంగానే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని బ్యాట్‌ ఉమన్‌ చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.

వాస్తవానికి కరోనా.. వుహాన్‌ ల్యాబ్‌లో పుట్టిందనే వాదనలకు ఝెంగ్లీ గతంలో రాసుకొచ్చిన కొన్ని రీసర్చ్‌ పేపర్లే కారణమనేది కొట్టిపారేయలేని నిజం. 2017లో ఝెంగ్లీ, తన సహ పరిశోధకులు వుహాన్‌ ల్యాబ్‌ పరిశోధనలపై ఓ పేపర్‌ పబ్లిష్‌ చేశారు. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ విధానంలో హైబ్రిడ్‌ గబ్బిలాల నుంచి కరోనా వైరస్‌లను సృష్టించినట్లు అందులో వారు రాసుకొచ్చారు. ఇందులో కొన్ని వైరస్‌లు మానవులకు వ్యాప్తి చెందే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారుల నుంచి రక్షణ కల్పించడం కోసమే ఇలాంటి వైరస్‌లను సృష్టించారని కొందరు చెబుతున్నా.. వీటి వల్ల మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందని విమర్శకులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉండగా.. వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌లో అత్యంత భద్రమైన బయోసేఫ్టీ లెవల్‌ 4 ల్యాబ్‌లు ఉన్నాయి. అయిన్పటికీ షీ ఝెంగ్లీ మాత్రం గబ్బిలాలపై తన పరిశోధనల్లో కొన్నింటిని బయో సేఫ్టీ లెవల్‌ 2 ల్యాబ్‌ల్లో జరిపినట్లు తెలిసింది. ఇక్కడ భద్రత తక్కువగా ఉంటుండటంతో వ్యాధికారక వైరస్‌లు బయటకు వెళ్లే అవకాశం లేకపోలేదు. అయితే ఈ వైరస్‌లు మానవులకు నేరుగా వ్యాపిస్తాయని చెప్పేందుకు ఆధారాలు లేవని, అందుకే తాను బీఎస్‌ఎల్‌-2 ల్యాబ్‌ల్లో పరిశోధనలు జరిపానని బ్యాట్‌ఉమన్‌ చెప్పడం గమనార్హం.

ఎవరీ బ్యాట్‌ఉమన్‌..

57 ఏళ్ల ఝెంగ్లీ వుహాన్‌ ల్యాబ్‌లో అత్యంత సీనియర్‌ వైరాలజిస్టు. గబ్బిలాలపై ప్రమాదకర పరిశోధనలు చేస్తుండటంతో ఆమెకు బ్యాట్‌ ఉమన్‌గా పేరొచ్చింది. 2004లో ప్రపంచవ్యాప్తంగా సార్స్‌ మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత ఈమె గబ్బిలాలపై తన పరిశోధనలు ప్రారంభించారు. 2011లో చైనాలోని ఓ గుహను సందర్శించిన ఆమె.. అక్కడి గబ్బిలాల్లో సార్స్‌ తరహా కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని