Covaxin: ప్రైవేటులో ధర ఎక్కువే.. ఎందుకంటే..!

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ప్రైవేటులో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు గల కారణాలను పేర్కొంటూ భారత్‌ బయోటెక్‌ వివరణ ఇచ్చింది.

Updated : 15 Jun 2021 16:36 IST

స్పష్టతనిచ్చిన భారత్‌ బయోటెక్‌

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ప్రైవేటులో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు గల కారణాలను పేర్కొంటూ భారత్‌ బయోటెక్‌ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి కొవాగ్జిన్‌ టీకా ఒక డోసును రూ. 150కే ఇస్తున్నామని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. దీర్ఘకాలం ఇలా తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యపడదని అభిప్రాయపడింది. అక్కడ జరిగిన కొంత నష్టాన్ని భర్తీ చేసేందుకే ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. అందుచేత ప్రైవేటు రంగానికి సరఫరా చేసే టీకాల ధర తగ్గించలేమని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. ఇక టీకా ఉత్పత్తిలో కేవలం పది శాతం కంటే తక్కువే ప్రైవేటుకు ఇస్తున్నామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

‘వ్యాక్సిన్‌ ధరను నిర్ణయించడంపై వివిధ అంశాలు ఆధారపడి ఉంటాయి. వ్యాక్సిన్‌ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలే కాకుండా తయారీ కేంద్రాల్లో సదుపాయాలు, ఉత్పత్తి సమయంలో సంభవించే వైఫల్యాలు, సరఫరా ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తయారీని అత్యంత సురక్షిత పద్ధతుల్లో చేయడం భారీ శ్రమతోపాటు ఖర్చుతో కూడకున్న పని’ అని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. అంతేకాకుండా కొవాగ్జిన్‌ టీకా ప్రతి బ్యాచ్‌ ఉత్పత్తి అయిన తర్వాత, మార్కెట్‌లోకి విడుదలకు ముందు దాదాపు 200 రకాల నాణ్యతా పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా వ్యాక్సిన్‌ తయారీ అత్యంత క్లిష్టమైనది కాబట్టే చాలా కంపెనీలు టీకాల అభివృద్ధికి ముందుకు రావు. తక్కువ మొత్తంలో సేకరించడం, సరఫరా ఖర్చులు ఎక్కువగా ఉండడంతోపాటు పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వానికి, భారీ ఎత్తున వ్యాక్సిన్‌ సేకరించే వారితో పోలిస్తే ప్రైవేటు మార్కెట్‌లో కొవాగ్జిన్‌ను ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో కేవలం పదిశాతం కంటే తక్కువ మొత్తాన్ని మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నామని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. మిగతావన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే అందిస్తున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వమే అర్హులందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నందున.. ప్రైవేటు సంస్థలు వ్యాక్సిన్‌ సరఫరా చేయడం తప్పనిసరేం కాదని పేర్కొంది. అది ఆయా ఆస్పత్రుల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని భారత్‌ బయోటెక్‌ అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే కరోనా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధరలను కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే ప్రకటించింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం.. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అసలు ధర ₹1200గా ఉంది. ఐదుశాతం జీఎస్టీ, రూ.150 సర్వీస్‌ ఛార్జితో సహా అన్ని పన్నులు కలుపుకొని గరిష్ఠ ధర ₹1410 అవుతుంది. ఇక కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర ₹600కాగా పన్నులతో కలిపి గరిష్ఠంగా  ₹780గా ఉంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి ధర ₹1145గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని