Delta Variant: జో బైడెన్‌, ఫౌచీ ఆందోళన!

భారత్‌లో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా డెల్టా వేరియంట్‌.. అమెరికాకు కూడా వ్యాప్తి చెందుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అమెరికన్లు కోరుతున్నారు.‘‘ ప్రజలారా, డెల్టా వేరియంట్‌ అత్యంత

Published : 09 Jun 2021 20:27 IST

వాషింగ్టన్: భారత్‌లో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా డెల్టా వేరియంట్‌.. అమెరికాకు కూడా వ్యాప్తి చెందుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని దేశ పౌరులను కోరుతున్నారు.‘‘ ప్రజలారా, డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకర కొవిడ్‌-19 స్ట్రెయిన్‌. యూకేలో ఈ డెల్టా వేరియంట్‌ 12 - 20 ఏళ్ల వయస్కుల్లో వేగంగా వ్యాపిస్తోంది. మీరు ఆ వయసు వారై.. వ్యాక్సిన్‌ ఇంకా తీసుకోకుండా ఉంటే త్వరపడండి. వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోండి. మనల్ని, మనల్ని ప్రేమించేవారిని రక్షించుకోవడానికి వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం’’అని బైడెన్‌ ట్వీట్ చేశారు. 

అంటువ్యాధుల నిపుణులు ఆంథోనీ ఫౌచీ డెల్టా వేరియంట్‌పై స్పందిస్తూ అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఆరు శాతం డెల్టా వేరియంట్‌వేనని తెలిపారు. అంతకన్నా ఎక్కువే ఉండే అవకాశాలున్నాయని, వాటిపై యూఎస్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘యూకేలో గుర్తించిన ఆల్ఫా వేరియంట్‌ కన్నా డెల్టా వేరియంట్‌ మరింత ప్రమాదకారిగా మారుతోంది. ఆల్ఫా వేరియంట్‌ను మించిపోతుంది. యూకేలో నమోదవుతున్న తాజా కేసుల్లో 60శాతం కేసులు ఈ వేరియంట్‌వే. యూకేలో జరుగుతున్నట్లు అమెరికాలో జరగనివ్వం’’అని మీడియా సమావేశంలో ఫౌచీ వెల్లడించారు.

ప్రస్తుతం అమెరికాలో 63.7శాతం మంది ప్రజలు కనీసం ఒక్క కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసును అయినా తీసుకున్నారు. 12 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ 70శాతం పూర్తయింది. జులై 4 నాటికి 18 ఏళ్లుపైబడిన అమెరికన్లలో 70శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్‌ అయినా ఇవ్వాలని దేశాధ్యక్షుడు బైడెన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అమెరికా వ్యాప్తంగా అధికారులు వ్యాక్సినేషన్‌పై పెద్ద ఎత్తున్న అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని