Omicron: ఒమిక్రాన్‌పై ఆందోళన ఉన్నా.. భయపడాల్సిన అవసరం లేదు: బైడెన్‌

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా ప్రపంచదేశాలకు వ్యాపిస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ను అడ్డుకోవడం కోసం ఆస్ట్రేలియా, జపాన్‌ సహా పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రయాణాలపై ఆంక్షలతోపాటు సరిహద్దుల్ని మూసివేస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి తీవ్రమైతే

Updated : 30 Nov 2021 13:57 IST

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా ప్రపంచదేశాలకు వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ను అడ్డుకోవడం కోసం ఆస్ట్రేలియా, జపాన్‌ సహా పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రయాణాలపై ఆంక్షలతోపాటు సరిహద్దుల్ని మూసివేస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి తీవ్రమైతే లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉన్నాయి. అయితే, అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఇప్పట్లో రాదని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. అమెరికాలో ఒమిక్రాన్‌ పరిస్థితిపై స్పందించిన ఆయన.. ఈ కరోనా కొత్త వేరియంట్‌ వల్ల ఆందోళన ఉండొచ్చు కానీ.. భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

ఎనిమిది దక్షిణాఫ్రికా దేశాలపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు మించి కొత్తగా లాక్‌డౌన్‌, ప్రయాణాలను నిషేధించాల్సిన అవసరం లేదని బైడెన్‌ తెలిపారు. కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తిని నియంత్రించడంలో యూఎస్‌ మునపటికన్నా మెరుగ్గా ఉందని తెలిపారు. ఒమిక్రాన్‌పై శాస్త్రీయంగా పోరాటం చేస్తామని భయాందోళనలు అక్కర్లేదన్నారు. ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయని, అలాగే బూస్టర్‌ డోసులు వైరస్‌ నుంచి మరింత రక్షణ కల్పిస్తాయని చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ ఆంటోనీ ఫౌచీ భావిస్తున్నట్లు వెల్లడించారు.

అంతకుముందు ఆంటోనీ ఫౌచీ ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇప్పటికైతే యూఎస్‌లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాకున్నా.. దేశంలో ఈ వేరియంట్‌ ప్రవేశించి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తాయా? లేదా?.. గత వేరియంట్‌ల కంటే ఇది ఎంతమేర ప్రమాదకరమనే విషయాలను శాస్త్రవేత్తలు మరో వారం లేదా రెండు వారాల్లో కనుక్కొంటారని చెప్పారు. మరోవైపు ఒమిక్రాన్‌.. అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని