Biden: వైరస్‌ నుంచి స్వాతంత్ర్యం వచ్చింది

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై విజయానికి చేరువయ్యామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆదివారం అమెరికా స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని శ్వేతసౌధంలో సుమారు వెయ్యి మందికి ఆయన విందు ఇచ్చారు....

Published : 05 Jul 2021 17:22 IST

కానీ పోరాటం ఆపొద్దన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు

వాషింగ్టన్‌: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై విజయానికి చేరువయ్యామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆదివారం అమెరికా స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని శ్వేతసౌధంలో సుమారు వెయ్యి మందికి ఆయన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బాణసంచా వెలుగులను ఆయన కుటుంబసభ్యులతో కలిసి తిలకించారు. కొవిడ్ నుంచి క్రమంగా బయటపడుతున్నామని.. స్వాతంత్ర్య వేడుకలను అమెరికా ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నుంచి స్వాతంత్ర్యం వచ్చిందనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఇదే సమయంలో.. కొవిడ్‌ను పూర్తిగా అధిగమించలేదని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా వైరస్ రూపాంతరం చెందుతూనే ఉందని గుర్తుచేసిన అమెరికా అధ్యక్షుడు.. డెల్టా వేరియంట్ వంటి శక్తిమంతమైన రకాలు పుట్టుకొస్తున్నాయని గుర్తుచేశారు. వైరస్‌పై పోరాటం ఆపొద్దని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు తీసుకోనివారే వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు చెబుతుండగా, టీకా తీసుకునేందుకు ప్రజలంతా ధైర్యంగా ముందుకురావాలని బైడెన్ సూచించారు.

స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అమెరికాలో కనీసం 70 శాతం మందికి టీకా ఒక్క డోసైనా ఇవ్వాలని బైడెన్‌ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. స్వాంతంత్ర్య దినోత్సవం నాటికి ఆ లక్ష్యానికి దాదాపు చేరువైంది. ఆదివారం నాటికి 67 శాతం మంది ప్రజలు కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నట్లు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది.

వేగవంతమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో అగ్రరాజ్యంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతంలో మృతుల సంఖ్య రోజూ వేలల్లో నమోదవ్వగా.. ప్రస్తుతం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు మరణాల సంఖ్య 200లోపే ఉంటోంది. అమెరికాలో ఇప్పటివరకు 33 మిలియన్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా.. అమెరికాలో 6,05,000 మందికి పైగా మృతిచెందినట్లు జాన్‌ హోప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని