Updated : 11/10/2021 12:23 IST

kashmir killings: అమాయకులపై పాక్‌ విషపు పడగ..!

‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ పేరిట కొత్త ముసుగు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

బిహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన 45 ఏళ్ల వీరేంద్ర పాస్వాన్‌ రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద.  నలుగురు ఆడపిల్లలు.. ఇద్దరు మగపిల్లలకు తండ్రి. తన ఒక్కడి సంపాదన మీదే కుటుంబం గడుస్తోంది. అతడు గతంలో కోల్‌కతాలో వెల్డర్‌గా పని చేశాడు. కొవిడ్‌ దెబ్బకు ఆ ఫౌండ్రీ మూతపడటంతో కుటుంబ పోషణకు దారులు  వెతికాడు.. తన బంధువులు సహా చాలా మంది గ్రామస్థులు ఉపాధి కోసం కశ్మీర్‌ వెళుతున్నారని తెలుసుకొని.. తనూ శ్రీనగర్‌కు వెళ్లాడు. ఓ చిన్న పానీపూరి బండి పెట్టుకొని రోజువారీ సంపాదించే చిరు ఆదాయాన్ని కూతురి పెళ్లి కోసం కూడబెట్టుకొంటున్నాడు. దుర్గా పూజ రోజుకు ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాడు. కానీ, కశ్మీర్‌లో పాకిస్థాన్‌ పెంచి పోషిస్తోన్న ఉగ్ర విషసర్పాలు గత వారం వీరేంద్ర స్థానికేతరుడంటూ కాల్చి చంపాయి. పానీపూరి బండి పక్కనే నిర్జీవంగా పడి ఉన్న అతడి మృతదేహం చిత్రం నెటిజన్లను కంటతడిపెట్టించింది. అతడి ఆరుగురి పిల్లల భవిష్యత్తు ఒక్కసారిగా చీకటి మయం అయిపోయింది. కశ్మీర్‌ ప్రభుత్వం రూ.1.25లక్షలు, బిహార్‌ ప్రభుత్వం రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించాయి. ఈ మొత్తాలు వారికి చేరేందుకు సమయం పడుతుంది. ఈ లోపు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా ఆ కుటుంబ సభ్యుల వద్ద డబ్బు లేదు. వీరేందర్‌ మృతదేహానికి కశ్మీర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడైతే అతడిని స్థానికేతరుడిగా భావించి ఉగ్రవాదులు హత్య చేశారో అదే మట్టిలో అతడి శరీరం కలిసిపోయింది.

పాత ఉగ్రవాదుల కొత్త ముసుగు..!

తాజాగా కశ్మీర్‌లోని మైనార్టీలు, స్థానికేతరుల హత్యల వెనుక ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ అనే సంస్థ హస్తం ఉంది. కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని తొలగించిన తొమ్మిది నెలల తర్వాత ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’(టిఆర్‌ఎఫ్‌) పేరు బయటకు వచ్చింది. 2020 ఏప్రిల్‌1వ తేదీన కుప్వారాలోని కెరాన్‌ ప్రాంతంలో మొదలైన ఎన్‌కౌంటర్‌ సందర్భంగా టీఆర్‌ఎఫ్‌ పేరు బయటకు వచ్చింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చిన ఐదుగురు దుండగులు ఓ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. భారత భద్రతా దళాలు నాలుగు రోజులపాటు పోరాడాయి. చివరికి ఆర్మీ ప్రత్యేక కమాండోలు రంగలోకి దిగి వారిని మట్టుబెట్టారు. ఆ చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలు ఎవరివో ఇప్పటికీ గుర్తించలేదు.

కశ్మీర్‌లో వేర్పాటు వాదానికి మతరంగు పులమటం కంటే రాజకీయ రంగు పులమడం మరింత సెక్యూలర్‌గా ఉంటుందని ఉగ్రవాదులు టీఆర్‌ఎఫ్‌ అనే పేరు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అక్కడ ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ సంస్థల పేర్లు మతం రంగుతో ఉన్న విషయం తెలిసిందే. 1990ల్లో జమ్ము కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ తర్వాత ఈ వ్యూహంతో పేరు పెట్టుకొన్న సంస్థ ఇదే. వాస్తవానికి టీఆర్‌ఎఫ్‌తోపాటు కశ్మీర్‌లో ఉన్న యాంటీ ఫాసిస్ట్‌ఫ్రంట్‌ ఉగ్ర సంస్థ కూడా ఈ కోవకే వస్తుంది. ఈ రెండు సంస్థలు లష్కరే, జైషే సంస్థలకు క్లోన్‌లు.

తొలి కేడర్‌ను పాక్‌ రప్పించి శిక్షణ..!

టీఆర్‌ఎఫ్‌ తొలి తరం కేడర్‌లోని స్థానిక కశ్మీరీలకు వాఘా సరిహద్దు మీదుగా పాక్‌కు రప్పించి అక్కడ శిక్షణ ఇచ్చింది. మరికొందరు యువకులను నియంత్రణ రేఖ నుంచి అక్రమంగా భారత్‌లోకి పంపింది. ఈ ఆగస్టులో టీఆర్‌ఎఫ్‌ అగ్రనాయకులు అబ్బాస్‌ షేక్‌ను సైనిక దళాలు అంతమొందించాయి. స్పోర్ట్స్‌ వేర్‌ ధరించిన దళాలు అతని స్థావరాన్ని చుట్టుముట్టి కాల్చి చంపాయి. ఇతను గత పదేళ్లుగా వివిధ ఉగ్ర సంస్థల్లో పనిచేశాడు. ఇతర సంస్థల్లో పనిచేసిన పలువురు ఉగ్రవాదులు ఇప్పుడు టీఆర్‌ఎఫ్‌లో కనిపిస్తున్నట్లు దళాలు పేర్కొన్నాయి.

క్షేత్ర స్థాయిలో బలమైన నెట్‌వర్క్‌తో..

టీఆర్‌ఎఫ్‌కు క్షేత్ర స్థాయిలో పనిచేసే సానుభూతిపరులు, ఇన్ఫార్మర్లు భారీగా ఉన్నారు. భద్రతా దళాల నిఘాలో లేనివారిని ఇందుకోసం తీసుకుంటారు. ఈ ఉగ్ర సంస్థ తేలిగ్గా ఉండే లక్ష్యాలను ఎంచుకొంటుంది. తమ లక్ష్యాలకు సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకొని ఉగ్రవాదులు అక్కడకు చేరుకొంటారు. ఉగ్రదాడి మొత్తాన్ని బాడీ కెమెరాలతో చిత్రీకరిస్తారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి మరికొంత మంది యువకులను ఆకర్షిస్తారు. గతేడాది నవంబర్‌లో శ్రీనగర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లపై దాడిని ఇలానే చిత్రీకరించారు. తాము లక్ష్యంగా ఎంచుకొన్న వ్యక్తిపై వివిధ ఆరోపణలతో సామాజిక మాధ్యమాల్లో ఛార్జిషీట్లను కూడా పెడుతుంది. ఉగ్రవాదుల ఫొటోలను బయటకు రానీయకుండా ఈ సంస్థ గోప్యంగా ఉంచుతుంది.

లక్ష్యం ఏమిటీ..?

కశ్మీర్‌లో బయటి వ్యక్తుల చొరబాట్లను సైన్యం బలంగా అడ్డుకోవడంతో.. స్థానికంగా ఉన్న వివిధ ఉగ్ర సంస్థలను ఏకం చేసి టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో భారత్‌లోని ఉగ్రవాదంతో తమకు జోక్యం లేదని పాక్‌ చెప్పుకోవడానికి అవకాశం లభించింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాక్‌ ఎలాగైనా ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షల నుంచి బయటపడాలని చూస్తోంది. భారత్‌లో ఉగ్రవాదానికి పాక్‌ సంబంధం లేదని చెప్పుకొనేందుకు టీఆర్ఎఫ్‌ను సృష్టించింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షల నుంచి బయటపడాలని భావిస్తోంది.

ఛోటా వలీద్ పేరు బయటకు..

ఛోటా వలీద్‌ అనే ఉగ్రవాది 20 రోజుల క్రితం భారత్‌లో అడుగు పెట్టాకే ఈ దాడులు పెరిగాయని తాజాగా కశ్మీర్‌లో భద్రతా దళాలు గుర్తించాయి. మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడుల్లో ఇతడి హస్తం ఉందని చెబుతున్నాయి. ఈ దాడులను స్థానిక ఉగ్రవాదులే చేసినా.. వీటి వెనుక వ్యూహం వలీద్‌దే అన్న అనుమానాలు ఉన్నాయి. పలు ఫోన్‌ కాల్స్‌ను అధికారులు గుర్తించాక ఇతని పాత్రపై ఓ అభిప్రాయానికి వచ్చారు. అతడే స్థానిక ఉగ్రవాదులకు ఫోన్లు చేసి దాడులు చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు తేలింది. ఇతను రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ తరపున పని చేస్తున్నాడా..? మరేదైనా గ్రూపు తరపున చేస్తున్నాడో భద్రతా దళాల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని