Bihar: మంత్రి కుమారుడి కాల్పులు.. నలుగురు చిన్నారులకు గాయాలు

మంత్రి ఇంటి సమీపంలో ఉన్న మామిడి తోటలో పిల్లలంతా చేరి ఆటలు ఆడుకోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మంత్రి కుమారుడు సిబ్బందితో కలిసి చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు.......

Published : 24 Jan 2022 02:03 IST

పాట్నా: మంత్రి ఇంటి సమీపంలో ఉన్న మామిడి తోటలో పిల్లలతో పాటు కొందరు యువకులు చేరి క్రికెట్‌ ఆడటం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మంత్రి కుమారుడు సిబ్బందితో కలిసి వారిపై దాడికి దిగాడు. అనంతరం తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా హర్దియా గ్రామంలో భాజపా నేత, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి నారాయణ ప్రసాద్ ఇల్లు ఉంది. ఆ పక్కనే ఉన్న మామిడి తోటలో ఆదివారం కొందరు పిల్లలు చేరి ఆడుకుంటున్నారు. అయితే.. అక్కడ ఆడకూడదని, తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్‌తోపాటు అతడి ఇంటి సిబ్బంది పిల్లలను మొదట హెచ్చరించారు. ఇందుకు వారు నిరాకరించగా.. కొందరు పెద్దలు కూడా వారికి తోడయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

అక్కడినుంచి వెళ్లిపోయిన బబ్లూ.. అనంతరం నాలుగు వాహనాల్లో తన అనుచరులను తీసుకువచ్చి వారిపై దాడికి దిగారు. ఆవేశంతో ఊగిపోయిన బబ్లూ ప్రసాద్​.. తన వద్ద ఉన్న తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. అనుచరులు జరిపిన దాడిలో నలుగురు పిల్లలు గాయపడ్డారు. 

దాడి, కాల్పుల గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. అంతా కలిసి మంత్రి ఇంటిపైకి దండెత్తారు. మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈలోగా బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి ఇంటి నుంచి ఒక పిస్టల్​ను, ఒక రైఫిల్​ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతవరకు మంత్రి కుమారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు పేర్కొన్నారు.

అయితే తన భూమిని గ్రామస్థులు ఆక్రమించుకునేందుకు యత్నించారని మంత్రి నారాయణ ప్రసాద్ ఆరోపించారు. గ్రామస్థులే మొదట తన కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ఆ తర్వాత తన కుమారుడు లైసెన్స్‌ కలిగిన తుపాకీతో అక్కడికి వెళ్లాడని, అతడిపైనా గ్రామస్థులు రాళ్లతో దాడి చేసినట్లు తెలిపారు. తన వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు