Jair Bolsonaro: అసలే బోల్సెనారో.. ఆపై టీకా వేసుకోలేదు..!  

కరోనా మహమ్మారిని ముందు నుంచి తక్కువ చేసి చూస్తున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో.. తమకు టీకాలు కూడా అక్కర్లేదని ఆ మధ్య కరాఖండీగా చెప్పేశారు

Published : 21 Sep 2021 13:39 IST

లోపలికి రావద్దన్న న్యూయార్క్‌ రెస్టారెంట్లు.. రోడ్డుపైనే పిజ్జా తిన్న అధ్యక్షుడు

న్యూయార్క్‌: కరోనా మహమ్మారిని ముందు నుంచి తక్కువ చేసి చూస్తున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో.. తమకు టీకాలు కూడా అక్కర్లేదని ఆ మధ్య కరాఖండీగా చెప్పేశారు. అయితే, ఆ తర్వాత కాస్త తగ్గి తమ దేశ ప్రజలు టీకాలు వేసుకునేందుకు అంగీకరించినప్పటికీ.. ఆయన మాత్రం ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోలేదు. టీకా వేసుకోకుండానే అమెరికా పర్యటనకు వెళ్లారు. టీకా ధ్రువపత్రం లేకుండా అక్కడి రెస్టారెంట్లు ఆయనను లోపలికి రానివ్వలేదు. 

ఈ వారంలో జరగబోయే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు బోల్సెనారో న్యూయార్క్‌ చేరుకున్నారు. గత ఆదివారం రాత్రి భోజనం చేసేందుకు బోల్సెనారో బృందం రెస్టారెంట్‌కు వెళ్లాలని భావించింది. అయితే న్యూయార్క్‌ రెస్టారెంట్లలో వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేకుండా ఎవర్నీ లోపలికి అనుమతించట్లేదు. దీంతో బోల్సెనారో రోడ్డు పక్కనే ఉన్న సైడ్‌వాక్‌పై నిల్చుని పిజ్జా తిన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బ్రెజిల్‌ కేబినెట్‌ మంత్రులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో బోల్సెనారో మద్దతుదారులు.. తమ దేశాధినేత ఎంతో నిరాడంబరంగా ఉన్నారంటూ పొగడ్తల్లో ముంచెత్తడం గమనార్హం.

నాకు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉంది..

ఐరాస సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలు, ప్రముఖులు టీకాలు వేసుకుని రావాలని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డే బ్లేసియో కోరారు. వ్యాక్సిన్‌ తీసుకోకపోతే తమ నగరానికి రావొద్దని కాస్త గట్టిగానే చెప్పారు. అయినా సరే.. ఐరాస అలాంటి నిబంధలేమీ పెట్టకపోవడంతో బోల్సెనారో న్యూయార్క్‌ వెళ్లారు. వెళ్లేముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనాను ఎదుర్కొనేందుకు సరిపడా రోగ నిరోధక శక్తి నాకుంది’’ అని చెప్పడం గమనార్హం.

కరోనాపై బోల్సెనారోది ముందు నుంచీ ఇదే ధోరణి. తనకు వైరస్‌ సోకిన విషయాన్ని స్వయంగా మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. అప్పుడు మాస్క్‌ కూడా ధరించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు బెంబేలెత్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు టీకా కూడా అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడి నిర్లక్ష్య వైఖరి కారణంగా బ్రెజిల్‌లో కరోనా విలయతాండవం చేసింది. కేసులు, మరణాల్లో ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉండటం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని