Rajnath Singh: స్వయంగా రక్షణమంత్రి.. వీరజవాన్‌ను వీల్‌ఛెయిర్‌లో తీసుకొచ్చి..

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం తూర్పు లద్దాఖ్‌లో పర్యటించారు. 1962లో భారత్‌, చైనా మధ్య జరిగిన యుద్ధ ప్రాంతం రెజాంగ్‌ లాకు వెళ్లిన ఆయన అక్కడ

Published : 18 Nov 2021 16:51 IST

దిల్లీ: కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం తూర్పు లద్దాఖ్‌లో పర్యటించారు. 1962లో భారత్‌, చైనా మధ్య జరిగిన యుద్ధ ప్రాంతం రెజాంగ్‌ లాకు వెళ్లిన ఆయన అక్కడ పునరుద్ధరించిన యుద్ధ స్మారకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాటి యుద్ధంలో పాల్గొన్న ఓ వీర జవాన్‌ను రక్షణమంత్రి స్వయంగా వీల్‌ఛెయిర్‌లో స్మారకం వద్దకు తీసుకురావడం విశేషం. 

1962 చైనా-ఇండియా యుద్ధంలో పాల్గొన్న బ్రిగేడియర్‌(రిటైర్డ్‌) ఆర్‌.వి. జాటర్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వృద్ధాప్యంలో ఉన్న ఆయనను రాజ్‌నాథ్‌ స్వయంగా వీల్‌ఛెయిర్‌ తోసుకుంటూ యుద్ధ స్మారకం వద్దకు తీసుకురావడం విశేషం. ఇందుకు సంబంధించి ఫొటోను కేంద్రమంత్రి ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ.. ‘‘బ్రిగేడియర్‌ ఆర్‌.వి. జాటర్‌ను కలిసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. యుద్ధం సమయంలో ఆయన కంపెనీ కమాండర్‌గా వ్యవహరించారు. ఆయన ధైర్యానికి సెల్యూట్‌. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని రాసుకొచ్చారు. 

రేజాంగ్‌ లా ప్రాంతంలో యుద్ధ స్మారకాన్ని ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి జవాన్లతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘18వేల అడుగుల ఎత్తులో రేజాంగ్‌ లాలో జరిగిన చారిత్రక యుద్ధం గురించి ఇప్పుడు ఊహించుకున్నా ఒళ్లు గగుర్పొడుతుంది. మేజర్‌ షైతాన్‌ సింగ్‌, ఆయన తోటి సైనికులు తమ చివరి శ్వాస, చివరి బుల్లెట్‌ వరకు పోరాడారు. శౌర్య పరాక్రమాలు, త్యాగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ స్మారకం.. భారత సైన్యం అద్వితీయమైన పరాక్రమానికి నిదర్శనం. వారి ధీరత్వం చరిత్ర పుటల్లోనే కాదు ప్రతి భారతీయుడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని సైన్యాన్ని కొనియాడారు. 

గత ఏడాదిన్నర కాలంగా తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఈ స్మారకాన్ని పునరుద్ధరించి ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని