
మూడో డోసుకు సిద్ధమవుతోన్న బ్రిటన్!
వచ్చే క్రిస్మస్ నాటికి మహమ్మారి నిర్మూలనకు కృషి
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన చాలా దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో తమ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో ధనిక దేశాలు ముందున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీలో దూసుకెళ్తున్న బ్రిటన్.. మూడో డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 50ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వచ్చే ఐదారు నెలల్లో మూడు డోసు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే క్రిస్మస్ నాటికి మహమ్మారి ముప్పును పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు బ్రిటన్ వెల్లడించింది.
మహమ్మారి నిర్మూలలో భాగంగా రెండు ఎంపికలపై ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ మీడియాకు వెల్లడించారు. కొత్తరకాలను ఎదుర్కొనే విధంగా వ్యాక్సిన్‌లలో మార్పులు చేయడం తొలి ఎంపిక కాగా.. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఫైజర్-బయోఎన్‌టెక్, ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా లేదా మోడెర్నాల మూడో డోసును ఇచ్చే ప్రణాళిక రెండో ఎంపిక అని క్రిస్ విట్టీ పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని బ్రిటన్ ప్రభుత్వం ఈమధ్యే వెల్లడించింది.
ఇక దాదాపు 6.7కోట్ల జనాభా కలిగిన బ్రిటన్‌లో ఇప్పటికే మూడున్నర కోట్ల మందికి టీకాలు అందించారు. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారీ స్థాయిలో వ్యాక్సిన్ డోసులను ఆ దేశం సమకూర్చుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లతో పాటు వివిధ ప్రయోగ దశల్లో ఉన్న మొత్తం ఎనిమిది సంస్థల నుంచి 51కోట్ల డోసులను సమకూర్చుకునేందుకు బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఒక్క ఫైజర్-బయోఎన్‌టెక్ నుంచే 6కోట్ల డోసులను ఆర్డర్ చేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ఈమధ్యే వెల్లడించింది.