‘అప్పటి వరకు యాత్రికులు వారణాసికి రావద్దు’

కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు వారణాసి పర్యటనకు యాత్రికులు దూరంగా ఉండాలంటూ జిల్లా యంత్రాంగం సూచించింది. దేశీయ, విదేశీ యాత్రికులు ఏప్రిల్‌ నెలలో తమ పర్యటనను రద్దు చేసుకుంటే మంచిదని పేర్కొంది.

Published : 15 Apr 2021 14:10 IST

లఖ్‌నవూ: కరోనా వైరస్ వ్యాప్తి‌ ఉద్ధృతి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు వారణాసి పర్యటనకు యాత్రికులు దూరంగా ఉండాలంటూ జిల్లా యంత్రాంగం సూచించింది. యాత్రికులు ఏప్రిల్‌ నెలలో తమ పర్యటనను రద్దు చేసుకుంటే మంచిదని పేర్కొంది. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్‌ కౌశల్‌ రాజ్‌ శర్మ ప్రకటన విడుదల చేశారు. ‘కరోనా వైరస్‌ కేసుల ఉద్ధృతి దృష్ట్యా ఏప్రిల్లో యాత్రికులు వారణాసి పర్యటనను రద్దు చేసుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా ఆలయ దర్శనానికి వస్తే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకొని నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలి’ అని శర్మ తెలిపారు. 

‘కరోనా వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పరిసర జిల్లాల ప్రజలు అనవసరంగా వారణాసికి రావద్దు. కాశీ ఆలయ దర్శనానికి ముందు మూడ్రోజుల్లోపు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకొని నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలి. లేకపోతే ఆలయ ప్రవేశానికి అనుమతి లభించదు’ అని వారణాసి జిల్లా కమిషనర్ దీపక్‌ అగర్వాల్‌ తెలిపారు.

వారణాసి జిల్లాలో ప్రస్తుతం 10,206 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్‌ తర్వాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కాశీ నగరంలో మార్చి 31న 550 యాక్టివ్‌ కేసులు ఉండగా.. నిన్నటికి ఆ సంఖ్య 1,585కి చేరింది. ఇప్పటికే నగరంలో నైట్‌ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా గంగా ఘాట్లలోకి సాయంత్రం 4 నుంచి ఉదయం 6గంటల వరకు ప్రవేశాన్ని నిషేధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని