Jharkhand: జడ్జి హత్య కేసులో సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల రివార్డు

ఝార్ఖండ్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసుకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ

Updated : 24 Nov 2022 14:57 IST

దిల్లీ: ఝార్ఖండ్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసుకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ప్రకటించింది.
‘హత్యకు సంబంధించిన సమాచారం తెలిసినవారు కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చు. విలువైన సమాచారాన్ని అందించిన వ్యక్తికి రూ. 5 లక్షల నగదు బహుమతి అందజేస్తాం. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ధన్‌బాద్‌ జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను ఆగస్టు 4న గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది. కానీ, ఆ తర్వాత సీబీఐకు సిఫార్సు చేసింది. ఈ కేసులో ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతడి సహచరుడు రాహుల్ వర్మతో సహా మొత్తం 17 మందిని అరెస్టు చేసినప్పటికీ ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి ముందడుగు పడలేదు. ఝార్ఖండ్ హైకోర్టు ఈ కేసును త్వరగా విచారించాలని సీబీఐని ఆదేశించింది. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను సీబీఐకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. రాష్ట్రంలోని న్యాయాధికారులకు భద్రత కల్పించేలా వారి ఇళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. జడ్జి హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆలస్యం ఎందుకు జరిగిందో కోర్టుకు చెప్పాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని