Lalu Prasad Yadav: ఉద్యోగాల కోసం భూములు రాయించుకుని.. లాలూపై కొత్త కేసు

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో

Published : 20 May 2022 11:30 IST

దిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై ఈ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ నేడు దర్యాప్తు చేపట్టింది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మీసా భారతి, హేమలతో పాటు పలువురు అభ్యర్థులపైనా కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా నేడు పలు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపింది. దిల్లీ, పట్నా, గోపాల్‌గంజ్‌లోని లాలూ నివాసాలతో పాటు పలు కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.

కాగా.. దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది వారాలకే ఈ కేసు నమోదవడం గమనార్హం. దాణా కుంభకోణానికి సంబంధించి పలు కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో రాంచీ కోర్టు ఆయనకు 14ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో గత నెల ఆయనకు బెయిల్‌ మంజూరవడంతో జైలు నుంచి బయటకొచ్చారు. ఇదిలా ఉండగా.. తాజా సోదాలను ఆర్జేడీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లాలూపై కేసు పెట్టిందంటూ దుయ్యబడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు