Covid Tests:కరోనా పరీక్షలు పెంచండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్రం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు.. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని...

Published : 18 Jan 2022 22:02 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్రం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు.. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ‘ఐసీఎంఆర్‌ పోర్టల్‌ డేటా ప్రకారం అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షలు తగ్గినట్లు కనిపిస్తోంది. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో టెస్టుల పెంపుపై తక్షణమే దృష్టిసారించాలి. కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా పరీక్షలు నిర్వహించాలి’ అని అందులో పేర్కొన్నారు.

‘టెస్టింగ్‌తో కొత్త క్లస్టర్‌లు, హాట్‌స్పాట్‌లను గుర్తించొచ్చు. తద్వారా కంటైన్‌మెంట్ జోన్‌ల ఏర్పాటు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైనింగ్, ఐసొలేషన్ తదితర నియంత్రణ చర్యలు సాధ్యపడతాయి. వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉన్నవారిని కాపాడొచ్చు’ అని చెప్పారు. లక్షణాలు ఉన్న వారిని, ఎట్‌ రిస్క్‌ కాంటాక్ట్‌లను తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు. ఇదిలా ఉండగా సోమవారం దేశవ్యాప్తంగా 16.49 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 2.38 లక్షల మందికి పాజిటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు 20వేలకు పైగా తగ్గాయి. పాజిటివిటీ రేటు కూడా 19.65 శాతం నుంచి 14.43 శాతానికి తగ్గింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై.. తాజా సూచనలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని