Petro Prices: ‘పెట్రో ధరలు పెంచినప్పుడు అడిగారా?’

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం..రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాలని కోరడాన్ని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌ విమర్శించారు....

Published : 22 May 2022 12:00 IST

రాష్ట్రాలు పన్నులు తగ్గించాలనడాన్ని తప్పుబట్టిన తమిళనాడు

చెన్నై: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాలని కోరడాన్ని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌ విమర్శించారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని కోరని కేంద్రం ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోందని వ్యాఖ్యానించారు.

‘‘కేంద్ర ప్రభుత్వం ధరల్ని పెంచినప్పుడు రాష్ట్రాల అభిప్రాయాల్ని తీసుకోలేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది. 2014 తర్వాత లీటర్‌ పెట్రోల్‌పై రూ.23 (250%), డీజిల్‌పై రూ.29 (900%) కేంద్రం పెంచింది. ఆ పెంచిన మొత్తం నుంచి ఇప్పుడు కొంత తగ్గించింది. పైగా రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోంది. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా?’’ అని త్యాగరాజన్‌ ట్విటర్‌ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.

నిత్యావసరాల పెంపునకు, తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం సాయంత్రం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ కూడా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని