చైనా ముందు ‘వృద్ధ’ సంక్షోభం!

చైనాలో పెరిగిపోతోన్న వృద్ధ జనాభా సంరక్షణ అక్కడి ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 02 Mar 2021 22:31 IST

వెలుగుచూస్తోన్న ‘సంరక్షణ కేంద్రాల’ మోసాలు

వాషింగ్టన్: ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన చైనా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఈ మధ్యే వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాతో పాటు భారత్‌ వంటి దేశాలతో ఘర్షణ వాతావరణానికి దిగుతోన్న చైనా, స్థానికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ పెరిగిపోతోన్న వృద్ధ జనాభా సంరక్షణ చైనాకు తలకుమించిన భారంగా మారుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వృద్ధాప్యంలో వారి సంరక్షణ కోసం అవసరమైన గదుల్లో కొరత, వాటి నిర్వహణలో వెలుగుచూస్తున్న మోసాలు చైనాకు మరో సవాలుగా మారాయని వృద్ధ జనాభా, సవాళ్లపై అధ్యయనాలు జరుపుతోన్న నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా మొన్నటివరకు ‘ఒక్కరే ముద్దు’ అంటూ కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించింది. కానీ, జనాభాలో వ్యత్యాసం ఎక్కువ కావడంతో అప్రమ్తమైన డ్రాగన్‌ దేశం, పిల్లలు కనడంపై ఉన్న ఆంక్షలను సడలించింది. అయితే, 2050 నాటికి చైనాలో దాదాపు సగం మంది 60ఏళ్ల వయసుపైబడిన వారే ఉంటారని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ప్రభుత్వానికి తీవ్ర భారంగా మారే ప్రమాదం ఉందని చైనా ముందుగానే పసిగట్టింది. ఇప్పటికే పెరిగిపోతున్న వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పేందుకు సిద్దమైంది. అయితే, వృద్ధుల సంరక్షణ సవాళ్లు మోసగాళ్లకు, పోంజీ వంటి పెట్టుబడి పథకాలకు ద్వారాలు తెరిచినట్లు అయ్యిందని చైనా ప్రభుత్వం తలపట్టుకుంటోంది. ఈ తరహా మోసాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలుగు చూశాయని, ప్రస్తుతం ప్రభుత్వం వీటిపై దర్యాప్తు జరుపుతోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇందులో భాగస్వామ్యమైన కంపెనీలను కూడా చైనా అధికారులు విచారిస్తున్నట్లు పేర్కొంది.

చైనాలో వయసుపైబడిన వారి పర్యవేక్షణను సాధారణంగా వారి కుటుంబ సభ్యులే చూసుకుంటారు. అయితే, బతుకుదెరువు, ఉద్యోగాల కోసం భారీ స్థాయిలో ప్రజలు పట్టణాలు, నగరాలకు వలస వెళుతుండడంతో వృద్ధులు మాత్రం వారి ఇళ్లలో ఒంటరిగానే మిగిలిపోతున్నారు. ముఖ్యంగా చైనా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో కోటి 60లక్షల మంది ఒంటరిగా ఉంటున్నట్లు తేలింది. ఇలా కుటుంబం, ఆర్థిక స్తోమత, పనిచేసేశక్తి..ఈ మూడు లేనివారి కోసం ప్రభుత్వమే సంరక్షణ బాధ్యత చూసుకునే ఏర్పాట్లు చేస్తోంది.

పెరిగిన ప్రైవేటు మోసాలు..!

‘దేశంలో వృద్ధుజనాభా క్రమంగా పెరిగిపోతోంది. వీరి సంరక్షణ చూసుకునేందుకు ప్రభుత్వం నిధులతో చేపడుతోన్న కార్యక్రమాలు ఏమాత్రం సరిపోవడం లేదు’ అని యూనివర్సిటీ ఆఫ్‌ చైనాకు చెందిన ప్రొఫెసర్‌ డాంగ్‌ కెయోంగ్‌ వెల్లడించారు. ఇలాంటి సంరక్షణ కేంద్రాలు నెలకొల్పేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరిన ప్రభుత్వం, వారికి పన్నుల్లో రాయితీ, సబ్సిడీలను అందిస్తోంది. అయితే, ప్రభుత్వం చెల్లించే దానికంటే నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుండడంతో ప్రైవేటు సంస్థలు, బిల్డర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. అక్రమ మార్గంలో లబ్ధిదారులకు నేరుగా ఇంటిని లేదా గదిని కేటాయించడంతో పాటు పలు సందర్భాల్లో వృద్ధులను మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సంపాదన చివరకు మోసగాళ్ల చేతుల్లో పెట్టి నష్టపోయిన ఓ వృద్ధుడు నదిలో దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మోసాల ఘటనలు ఎక్కువైన నేపథ్యంలో చైనా ప్రభుత్వం అక్కడి ప్రైవేటు సంస్థలు, మోసగాళ్లపై విచారణ జరుపుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో వృద్ధ జనాభా మరింత పెరుగనున్న నేపథ్యంలో వారి సంరక్షణ కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని