చైనా రెచ్చగొట్టే ప్రవర్తనే గల్వాన్‌ లోయ ఘటనకు కారణం.. డ్రాగన్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

ద్వైపాక్షిక ఒప్పందాలకు విరుద్ధంగా.. చైనా రెచ్చగొట్టే ప్రవర్తన, ఏకపక్ష ప్రయత్నాలే గల్వాన్ లోయ ఘటనకు దారితీశాయని భారత్ శుక్రవారం పునరుద్ఘాటించింది. లోయలో యథాతథ స్థితిని మార్చేందుకు డ్రాగన్‌ యత్నించిందని, ఫలితంగా స్థానికంగా ప్రశాంత వాతావరణం...

Published : 24 Sep 2021 23:08 IST

దిల్లీ: ద్వైపాక్షిక ఒప్పందాలకు విరుద్ధంగా చైనా రెచ్చగొట్టే ప్రవర్తన, ఏకపక్ష ప్రయత్నాలే గల్వాన్ లోయ ఘటనకు దారితీశాయని భారత్ పునరుద్ఘాటించింది. లోయలో యథాతథ స్థితిని మార్చేందుకు డ్రాగన్‌ యత్నించిందని, ఫలితంగా స్థానికంగా ప్రశాంత వాతావరణం దెబ్బతీనడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలూ ప్రభావితం అయ్యాయని పేర్కొంది. ‘భారత్‌ అన్ని ఒప్పందాలను ఉల్లంఘించి, చైనా భూభాగంపై అక్రమంగా చొరబడినందునే ఈ ఘటన జరిగింది’ అని చైనా విదేశాంగ ప్రతినిధి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ.. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గతేడాది చేపట్టిన అభివృద్ధికి సంబంధించి భారత్‌ వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందన్నారు. ఈ నెల మొదట్లో ఇరు దేశాల దౌత్యాధికారుల సమావేశంలో భారత్‌ స్పష్టం చేసినట్లుగా.. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ, తూర్పు లద్ధాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి మిగిలిన ఇతర సమస్యల పరిష్కారానికి చైనా చొరవ చూపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత వారం షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సమావేశాల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రి  జైశంకర్, చైనా మంత్రి వాంగ్ యి ఇదే విషయమై చర్చించారు. ఇరుపక్షాల సైనిక, దౌత్య అధికారులు మరోసారి సమావేశమై మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని జైశంకర్‌ ఆ సందర్భంలో పేర్కొన్నారు. 2020 జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని