Published : 14/11/2021 14:22 IST

Glasgow Climate Pact: భారత్‌ మాటకు విలువిచ్చిన ‘గ్లాస్గో’

నిర్మాణాత్మక ఒప్పందంతో ముగిసిన ‘కాప్‌26’

గ్లాస్గో: భూతాపానికి అడ్డుకట్ట వేసి మానవాళిని రక్షించుకోవడమే లక్ష్యంగా సాగిన ఐరాస వాతావరణ సదస్సు(కాప్‌26) ఎట్టకేలకు ఓ నిర్మాణాత్మక ఒప్పందంతో ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న దాదాపు 200 దేశాలు కొత్త వాతావరణ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ‘శిలాజ ఇంధనాల నిర్మూలన’ ప్రతిపాదనపై భారత్‌ చేసిన నిర్మాణాత్మక సూచనలు అంగీకరిస్తూ.. ఒప్పందాన్ని ‘శిలాజ ఇంధనాల దశలవారీ తగ్గింపు’నకు పరిమితం చేశారు.

ఈ నేపథ్యంలో గ్రీన్‌హౌస్ వాయువులతో హానికరమైన వాతావరణానికి కారణమవుతున్న బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు కుదిరిన ఐరాస తొలి వాతావరణ ఒప్పందం ఇదే కావడం విశేషం. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసే లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా, తదుపరి కార్బన్ కోతలపై చర్చించడానికి వచ్చే ఏడాది సమావేశం కావాలని ఒప్పందంలో భాగంగా దేశాలు అంగీకరించాయి. భూగ్రహం, ప్రజల శ్రేయస్సు కోసం చేసిన కీలక ఒప్పందంతో ముగిసిన ఈ సమావేశ స్ఫూర్తిని నిలిపి ఉంచుతారని ఆశిస్తున్నట్లు కాప్‌26 అధ్యక్షుడు ఆలోక్‌ శర్మ అన్నారు. 

అయితే, భారత్‌ ప్రతిపాదించిన మార్పులపై పలు దేశాలు పెదవి విరిచాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు.. వారి వృద్ధి లక్ష్యాలు, పేదరిక నిర్మూలన వంటి అజెండాల అమలులో కీలక దశలో ఉన్న సమయంలో ‘శిలాజ ఇంధనాల నిర్మూలన’ తీర్మానం సహేతుకం కాదని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ గ్లాస్గో సమావేశానికి వివరించారు. తెలివితక్కువ, విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. పారిస్‌ వాతావరణ సదస్సు సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మనసా, వాచా, కర్మనా ఆచరించాలని నొక్కి చెప్పారు. 

అయితే, శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు సంపదతో సుభిక్షంగా విలసిల్లుతున్నాయని గుర్తుచేశారు. ప్రతి దేశం నెట్‌జీరో (కర్బన ఉద్గార తటస్థత) సాధనా లక్ష్యాలను ఆయా ప్రాంతాల పరిస్థితులు, బలాలు, బలహీనతలను అనుసరించి సాధిస్తాయని పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల బాధ్యతాయుత వినియోగం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కని పునరుద్ఘాటించారు. ఉదాహరణకు భారత్‌లో రాయితీ ధరతో ఇస్తున్న ఎల్‌పీజీ గురించి ప్రస్తావించారు. దీని వల్ల పేద కుటుంబాల్లో కాలుష్యం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధన వినియోగ నిర్మూలన గురించి సదరు దేశాల హామీని కోరడం దుర్విచక్షణే అవుతుందని స్పష్టం చేశారు.

నిజానికి గ్లాస్గో సమావేశం శుక్రవారమే ముగియాల్సి ఉంది. కానీ, ముసాయిదా ఒప్పందంలోని ‘శిలాజ ఇంధన నిర్మూలన’ ప్రతిపాదనపై భారత్‌ సవరణలు సూచించడంతో ఒప్పందంపై ఆరోజు ఎలాంటి ఫలితం తేలలేదు. దీంతో శనివారానికి సమావేశాన్ని పొడిగించి చివరకు భారత్‌ సహా మరికొన్ని దేశాలు చేసిన విజ్ఞప్తులను స్వీకరించి ఓ ఆమోదయోగ్య ఒప్పందానికి రూపకల్పన చేశారు. అయితే, కొన్ని దేశాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సమావేశానికి అధ్యక్షత వహించిన భారత సంతతి బ్రిటీష్‌ మంత్రి ఆలోక్‌ శర్మ సభ్య దేశాలకు క్షమాపణలు చెబుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని