Lakhimpur Kheri: లఖింపుర్‌ ఘటన.. రేపు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్‌, ప్రియాంక

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు.

Published : 12 Oct 2021 18:33 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సభ్యుల బృందం బుధవారం రాష్ట్రపతిని కలిసి లఖింపుర్‌ ఘటనపై వాస్తవాలతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, అధిర్‌ రంజన్‌ చౌధరీ, కేసీ వేణుగోపాల్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రేపు 11.30 గంటలకు వీరు రాష్ట్రపతిని కలవనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

లఖింపుర్‌ ఘటనలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజయ్‌ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని రాహుల్‌ బృందం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఈ కేసులో అరెస్టయిన ఆశిష్‌ మిశ్రా ప్రస్తుతం యూపీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. గత శనివారం ఆయనను 12 గంటల పాటు విచారించి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. అయితే విచారణలో ఆశిష్‌ సరిగా సహకరించడం లేదని, మరికొన్ని రోజులు పోలీస్‌ రిమాండ్‌కు అప్పగించాలని పోలీసులు అభ్యర్థించారు. వీరి అభ్యర్థన మేరకు కోర్టు.. ఆశిష్‌ను మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని