Finland: ఫిన్లాండ్‌ ప్రధానికి ‘బ్రేక్‌ఫాస్ట్‌’ చిక్కులు

అతిచిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టడమేగాక, కరోనా నియంత్రణలో అగ్రరాజ్యాలను సైతం వెనక్కి నెట్టి మెరుగైన పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన ఫిన్లాండ్‌ ప్రధాని

Updated : 29 May 2021 20:07 IST

హెల్సింకి: అతిచిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టడమేగాక, కరోనా నియంత్రణలో మెరుగైన పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌.. ఇప్పుడొక వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని తన బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ప్రజల సొమ్మును అక్రమంగా వినియోగించుకుంటున్నారని వార్తలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..

ప్రధాని సనా మారిన్‌ తన కుటుంబంతో కలిసి కేసరాంటలోని తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. అయితే ప్రధాని తన కుటుంబం మొత్తం బ్రేక్‌ఫాస్ట్‌ కోసం నెలకు 365 డాలర్లను ప్రభుత్వ ఖజానా నుంచి క్లెయిమ్‌ చేసుకుంటూ వస్తున్నారని స్థానిక పత్రికలు కథనాలు రాశాయి. దీంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా ప్రధాని తన బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ప్రజల సొమ్మును వినియోగించుకోవచ్చని దేశ చట్టాల్లో ఎక్కడా లేదని అక్కడి న్యాయ నిపుణులు కొందరు చెబుతున్నారు.

అయితే ఈ ఆరోపణకు సంబంధించిన దర్యాప్తును స్వాగతిస్తూ ప్రధాని సనా స్పందించారు. ‘ఒక ప్రధానిగా నేను ఈ ప్రయోజనాన్ని కోరలేదు. లేదా ఈ విషయాన్ని నిర్ణయించడంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు’ అని ట్వీట్ చేశారు. అయితే దీనిపై విచారణ జరపాలంటూ డిమాండ్లు రావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. డిటెక్టివ్‌ సూపరిండెంట్‌ టీము జోకినెన్‌ దీనిపై స్పందిస్తూ, ‘‘మంత్రులు పెట్టే ఖర్చులపై చట్టంలో ఎక్కడా ఇలాంటి అనుమతి ఉన్నట్లు కనిపించదు’’ అన్నారు. 

ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు, ‘‘మేం ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల నిర్ణయాలపై తనిఖీ చేస్తాం. అంతేకానీ, ప్రధానమంత్రికి గానీ, ఆమె అధికారిక కార్యక్రమాలకు గానీ ఈ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పారు.

2019 డిసెంబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్‌.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల నుంచి మంచి మద్దతు కూడగట్టుకున్నారు. కరోనాను తొలినాళ్లలోనే అరికట్టడానికి విశేష కృషి చేశారు. యూరప్‌లో అతితక్కువ కేసులు వచ్చిన దేశాల్లో ఫిన్లాండ్‌ కూడా ఒకటి కావడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని