Vaccination Drive: రాష్ట్రాల వద్ద ఇంకా 11.65 కోట్ల డోసులు

కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 11.65 కోట్ల డోసుల నిల్వలు ఉన్నాయని శుక్రవారం వెల్లడించింది.

Published : 22 Oct 2021 23:11 IST

దిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 100 కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసి భారత్‌ అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్పందించిన కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 11.65 కోట్ల డోసుల నిల్వలు ఉన్నాయని శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 104.5 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన ప్రణాళికలు, అధునాతన సాంకేతిక సాయంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు త్వరితగతిన టీకాలు అందించగలిగామని.. అందుకే ఇంతవేగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 71 కోట్ల మందికి టీకా మొదటి డోసు అందించగా, 29 కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.

100 కోట్ల మైలురాయిని పూర్తిచేసుకున్న అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం ఆసాంతం ఆకట్టుకునేలా సాగింది. టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదని.. దేశ సంకల్ప బలం అని ప్రధాని పేర్కొన్నారు. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయమని, నవ భారతానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. వీఐపీ సంస్కృతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికీ టీకాలు అందజేస్తున్నామని తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు.. ఈ ఘనతే సమాధానమని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని