Delhi: ఒమిక్రాన్‌ నుంచి కోలుకుంటున్న దిల్లీ.. త్వరలోనే ఆంక్షల ఎత్తివేత

కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ కోలుకుంటోందని, గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. పాజిటివిటీ రేటు

Published : 25 Jan 2022 13:16 IST

దిల్లీ: కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ కోలుకుంటోందని, కొద్ది రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. పాజిటివిటీ రేటు దిగివస్తోన్న క్రమంలో వీలైనంత త్వరగా ఆంక్షలను సడలిస్తామని తెలిపారు.

‘‘కొవిడ్‌ కారణంగా దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ, ప్రజల ఆరోగ్యమే ప్రధానం గనుక.. ఆంక్షలు విధించాల్సి వచ్చింది. అయితే, కొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పాజిటివిటీ రేటు కూడా నేడు 10శాతంగా ఉండొచ్చు. అందువల్ల, వారాంతపు కర్ఫ్యూతో పాటు దుకాణాల సరి-బేసి నిబంధనలను ఎత్తివేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరాం. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనలను ఎల్జీ అంగీకరించలేదు. వీలైనంత త్వరలోనే ఆంక్షలను సడలిస్తాం’’ అని కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఇక, దిల్లీలో 100శాతం మందికి తొలి డోసు పూర్తి కాగా.. 82శాతం మందికి రెండు డోసుల టీకా అందించినట్లు సీఎం తెలిపారు.

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో ఇటీవల దిల్లీలో రోజువారీ కేసులు అమాంతం పెరిగాయి. పాజిటివిటీ రేటు కూడా రికార్డు స్థాయిలో 30శాతం దాటింది. అయితే గతకొన్ని రోజులుగా కేసులు దిగొస్తున్నాయి. సోమవారం 5,700 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతక్రితం రోజు(9,197 కేసులు)తో పోలిస్తే కొత్త కేసుల్లో 37శాతం తరుగుదల కనిపించింది. ఇక జనవరి 15న 30శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు కూడా 11.8శాతానికి పడిపోయింది. దీంతో ఆంక్షలను క్రమక్రమంగా సడలించాలని దిల్లీ సర్కారు యోచిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని