కొవిడ్‌ మూలాలు: దర్యాప్తు జరిపినా..వీడని గుట్టు!

కొవిడ్‌ మూలాలపై మరోసారి దర్యాప్తును కొనసాగించాలని పిలుపునిస్తూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం బహిరంగ లేఖ విడుదల చేసింది.

Published : 05 Mar 2021 20:37 IST

మరోసారి దర్యాప్తు చేయాలంటున్న అంతర్జాతీయ నిపుణులు

షాంఘై: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి మూలాలను కనిపెట్టేందుకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిగింది. అయినప్పటికీ కొవిడ్‌ మూలాలపై ఎలాంటి స్పష్టత రాలేదు. వీటి మూలాలను ప్రపంచం తెలుసుకోవడం దరిదాపుల్లో కనిపించడం లేదని అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దర్యాప్తును కొనసాగించాలని పిలుపునిస్తూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం బహిరంగ లేఖ విడుదల చేసింది.

సంవత్సరం గడిచినా..యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌ మూలాలను కనుక్కోవడంలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్‌ నిపుణులు నికోలయ్‌ పెట్రోవ్‌స్కై అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ మూలాలపై వస్తోన్న వాదనలకు జవాబిచ్చే విధంగా స్వతంత్ర, నిస్పక్షపాత దర్యాప్తును ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయలేకపోయిందన్నారు. కొవిడ్‌ మూలాలను తెలుసుకునేందుకు మరోసారి దర్యాప్తు జరపాలంటూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందంతో బహిరంగ లేఖ విడుదల చేస్తున్నామన్నారు.

WHO తీరుపై విమర్శలు..

కొవిడ్‌ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ దర్యాప్తు బృందం నెల రోజుల పాటు చైనాలో పర్యటించింది. కానీ, దర్యాప్తు జరిపిన తీరుపై ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా అధికారులపైనే దర్యాప్తు బృందం పూర్తిగా ఆధారపడిందని.. సరైన ఆధారాలు, కీలక సమాచారం సేకరించడంలో విఫలమైందనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. వైరస్‌ను మొట్టమొదటి సారిగా గుర్తించిన ప్రదేశం వివరాలను ఇవ్వడానికి చైనా సుముఖంగా లేదని దర్యాప్తు బృంద సభ్యులు తొలుత వెల్లడించిన విషయాన్ని అంతర్జాతీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. వుహాన్‌లోని ల్యాబ్‌ నుంచి వైరస్‌ బయటపడే అవకాశమే లేదంటూ దర్యాప్తు బృందం సభ్యుడే కొట్టిపారేయడం ఎలాంటి అర్థం లేని వ్యాఖ్య అని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ నిపుణుడు పెట్రోవ్‌స్కై పేర్కొన్నారు. అలా కొట్టిపారేయడానికి కావాల్సిన ఎలాంటి శాస్త్రీయ సమాచారం దర్యాప్తు నివేదికలో కనిపించలేదని స్పష్టంచేశారు.

మరోసారి దర్యాప్తు చేయాల్సిందే..

కొవిడ్‌ మహమ్మారికి కారణమైన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌, తొలుత చైనాలోని వుహాన్‌లో బయటపడిందనే యావత్‌ ప్రపంచం భావించింది. ఈ మహమ్మారి మూలాలను శోధించాలని ప్రపంచ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడితెచ్చాయి. తొలుత దీనికి ఒప్పుకోని చైనా, చివరకు అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిడితో దర్యాప్తునకు అంగీకరించింది. దీంతో డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలోని అంతర్జాతీయ నిపుణులు బృందం వుహాన్‌లోని ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలను పరిశీలించి దర్యాప్తు జరిపింది. అయితే, కొవిడ్‌ మూలాలు వుహాన్‌లోనే తొలుత బయటపడ్డాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు బృందం ప్రకటించింది. ఇతర జంతువుల నుంచే సోకి ఉండవచ్చని అభిప్రాయపడినప్పటికీ వాటికి సంబంధించిన రుజువులను కనిపెట్టలేకపోయింది.

ఇలా మిస్టరీగా మారిన కొవిడ్‌ మూలాలపై గుట్టు విప్పేందుకు పరిశోధనలు కొనసాగించాలని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు జరిపినప్పటికీ కొవిడ్‌ మూలాలను ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదన్నారు. ఈ విషయాలను యావత్‌ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ బహిరంగ లేఖను విడుదల చేస్తున్నామని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ మూలాలపై చైనాలో జరిపిన దర్యాప్తు నివేదికపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని