Corona Updates: 84మంది ట్రైనీ ఐఏఎస్‌లకు కరోనా.. 500మంది పోలీసులకూ పాజిటివ్‌!

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ ప్రభావంతో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.......

Published : 19 Jan 2022 17:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఒమిక్రాన్‌ ప్రభావంతో  గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 2.82లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఈ రక్కసిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ భారీ సంఖ్యలో ఇన్ఫెక్షన్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పలు చోట్ల కొవిడ్‌ పరిస్థితిపై కొన్ని అప్‌డేట్స్‌..

దెహ్రాదూన్‌‌: ముస్సోరిలోని లాల్‌బహుదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో కరోనా కలకలం రేపుతోంది. శిక్షణలో ఉన్న 84మంది ఐఏఎస్‌లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. అనుబంధ సర్వీసులతో పాటు మొత్తం 480 మంది శిక్షణా ఐఏఎస్‌ల బృందం ఆదివారం గుజరాత్‌ నుంచి అకాడమీకి చేరుకుంది. వారికి దెహ్రాదూన్‌లోని రైల్వేస్టేషన్‌లో ఆర్‌టీ- పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. 84మందిలో వైరస్‌ ఉన్నట్టు తేలినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.


ఉత్తరాఖండ్‌ డీజీపీ కార్యాలయంలో కొవిడ్‌ కలవరం

అలాగే, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోనూ కరోనా కలకలం సృష్టించింది. డీజీపీ కార్యాలయంలో 25మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరితో కాంటాక్టు అయిన వారంతా పరీక్షలు చేయించుకొని స్వీయ నిర్బంధంలో ఉండాలని డీజీపీ అశోక్‌కుమార్‌ ఆదేశించారు. కొవిడ్ బారినపడిన వారంతా రెండు డోసుల టీకా వేయించుకున్నారనీ.. అందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో దాదాపు ఎనిమిది నెలల తర్వాత తొలిసారి మంగళవారం 4482 పాజిటివ్‌ కేసులు రావడం గమనార్హం.


మహారాష్ట్రలో 499మంది పోలీసులకు పాజిటివ్‌

ముంబయి: మహారాష్ట్ర పోలీస్‌శాఖను కరోనా మహమ్మారి వణికిస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలోనే 499మంది పోలీస్‌ సిబ్బంది కొవిడ్‌ బారినపడినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 95మంది పోలీస్‌ అధికారులు ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4090 మంది  (821 మంది పోలీస్‌ అధికారులు, 3269మంది) వైరస్‌తో బాధపడుతున్నారని వెల్లడించారు. కొవిడ్ విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా మహారాష్ట్ర పోలీస్‌ శాఖలో 5854మంది పోలీస్‌ ఉన్నతాధికారులు, 40,959మంది సిబ్బంది కరోనా బారినపడినట్టు తెలిపారు. అలాగే,  కొవిడ్‌ కాటుకు 46మంది అధికారులు, 459మంది పోలీస్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఒక్క ముంబయి మహానగరంలోనే 10,666 మంది పోలీసు సిబ్బంది కొవిడ్‌ బారినపడగా.. వారిలో 126మంది మృతిచెందినట్టు వివరించారు. ముంబయిలో ప్రస్తుతం 1273 మంది పోలీసులు కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. 


మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌కు పాజిటివ్‌

లుథియానా: పంజాబ్‌ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో చికిత్స నిమిత్తం ఆయన్ను దయానంద్‌ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సందీప్‌ శర్మ వెల్లడించారు. ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ వయస్సు ప్రస్తుతం 94 ఏళ్లు.


దిల్లీలో ఇంకా ఆ స్థాయికి కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గలేదు!

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కొవిడ్‌ కట్టడికి విధించిన ఆంక్షల్ని ఎత్తివేసే స్థాయికి ఇంకా పాజిటివిటీ రేటు తగ్గలేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు పరిస్థితిని సమీక్షించనున్నట్టు చెప్పారు. బుధవారం కొత్తగా దాదాపు 13వేల కేసులు రావొచ్చని తెలిపారు. దిల్లీలో పాజిటివిటీ రేటు 30శాతం నుంచి 22.5శాతానికి తగ్గిందనీ.. అయితే, హఠాత్తుగా అన్ని ఆంక్షల్నీ ఎత్తివేసేందుకు పాజిటివిటీ రేటు ఇంకా సగానికి తగ్గాల్సి ఉందన్నారు. నగరంలో సరి-బేసి విధానంలో దుకాణాలు తెరవాలన్న ఆంక్షల నేపథ్యంలో కొందరు వ్యాపారులు నిరసనలు తెలుపుతుండటంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 


ఒడిశాలో పిల్లలపై కొవిడ్‌ పంజా

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా 11వేలకు పైగా కొత్త కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 991మంది పిల్లలు (18 ఏళ్ల లోపు) ఉండటం గమనార్హం. గడిచిన 24గంటల వ్యవధిలో 69వేలకు పైగా టెస్టులు చేయగా.. 11,607 పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు. గతేడాది మే 26న అత్యధికంగా 11,623 కేసులు రాగా.. ఆ స్థాయిలో మళ్లీ కొవిడ్‌ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. ఖుర్దా జిల్లాలోనే అత్యధిక కేసులు బయటపడుతున్నాయి. తాజాగా 4347 కొత్త కేసులు అక్కడ రాగా.. సుందర్‌గఢ్‌ జిల్లాలో 1219, కటక్‌ జిల్లాలో 898 చొప్పున కేసులు వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 84,770కి పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని