Vaccination: కరోనా సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ మధ్య వ్యత్యాసం అదే..!

కరోనా టీకాలు భారత్‌కు భారీగా ప్రయోజనాన్ని చేకూర్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ మూడో వేవ్‌ సమయంలో టీకా కారణంగా మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉందని పేర్కొంది. అలాగే రెండో వేవ్‌, తాజా ఉద్ధృతికి మధ్య పోలిక తెస్తూ ఆరోగ్య శాఖ టీకా ఆవశ్యతను వివరించింది.  

Published : 21 Jan 2022 01:48 IST

వివరించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: కరోనా టీకాలు భారత్‌కు భారీగా ప్రయోజనాన్ని చేకూర్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ మూడో వేవ్‌ సమయంలో టీకా కారణంగా మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉందని పేర్కొంది. అలాగే సెకండ్‌ వేవ్‌, తాజా ఉద్ధృతికి మధ్య పోలిక తెస్తూ ఆరోగ్య శాఖ టీకా ఆవశ్యతను వివరించింది.   

కరోనా రెండో దశలో ఏప్రిల్ 30న 3,86,452 కొత్త కేసులు వచ్చాయి. 3,059 మరణాలు సంభవించాయి. 31 లక్షల క్రియాశీల కేసులున్నాయి. అప్పుడు 2 శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఇప్పటి విషయానికి వస్తే.. జనవరి 20, 2022న 3,17,532 కొత్త కేసులొచ్చాయి. 380 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ బాధితుల సంఖ్య 19 లక్షలకు పైనే ఉంది. అర్హులైన జనాభాలో 72 శాతం మందికి రెండు డోసులు అందాయి. అప్పుడూ ఇప్పుడూ కొత్త కేసులు మూడు లక్షలపైనే ఉన్నప్పటికీ.. మరణాల పరంగా భారీ వ్యత్యాసం కనిపిస్తుండటం గమనార్హం.  

ఐరోపాలో తగ్గుతూ..ఆసియాలో పెరుగుతున్న వైరస్ వ్యాప్తి..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగోసారి కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 29 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుతుండగా.. ఆసియా దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ్‌ బెంగాల్, యూపీ, గుజరాత్, ఒడిశా, దిల్లీ, రాజస్థాన్‌ క్రియాశీల కేసులు పరంగా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. దాంతో ఆయా రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తగిన మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

160 కోట్ల డోసుల పంపిణీ.. 

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 160 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. అర్హులైన జనాభాలో సుమారు 72 మంది రెండు డోసులు తీసుకున్నారు. అలాగే 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 52 శాతం మంది మొదటి డోసు వేయించుకున్నారు. అలాగే 61 లక్షలకు పైగా ప్రికాషనరీ డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని