
పట్టాలెక్కుతున్న కొవిడ్ ఐసోలేషన్ కోచ్‌లు..!
4వేల కోచ్‌లు సిద్ధం చేసిన రైల్వేశాఖ
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కొవిడ్ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే పనిలో ఆయా రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కొవిడ్ ఐసోలేషన్ కోచ్‌లను మరోసారి సిద్ధం చేస్తోంది. అవసరమైన రాష్ట్రాల్లో రైల్వే ఐసోలేషన్ బోగీలను ఉంచేందుకు ఇప్పటివరకు 4వేల కోచ్‌లను సిద్ధం చేసినట్లు వెల్లడించింది.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు గతేడాది రైల్వేశాఖ తయారు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కోచ్‌లను మరోసారి సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిలో కొన్నింటిని మహారాష్ట్రలో అందుబాటులో ఉంచామని రైల్వేశాఖ ప్రకటించింది. ‘కరోనా పోరులో భాగంగా రైల్వేశాఖ తన వనరులను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కొవిడ్ ఐసోలేషన్ కోచ్‌లను మహారాష్ట్రలోని నందూర్బార్‌లో అందుబాటులో ఉంచాము. అక్కడ కరోనా రోగులకు సేవలు ప్రారంభమయ్యాయి’ అని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం నందూర్బార్‌లో 94 కొవిడ్ ఐసోలేషన్ కోచ్‌లు ఏర్పాటు చేయగా.. వీటిలో ప్రస్తుతం ఆరుగురు రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి.. ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరగడం, కొవిడ్ పడకలు అందుబాటులో లేని రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు రైల్వే ఐసోలేషన్ కోచ్‌లను కేటాయిస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
మాకూ ఐసోలేషన్ కోచ్‌లు ఇవ్వండి..
దేశ రాజధానిలో కొవిడ్ తీవ్రత పెరుగుతోన్న వేళ.. ప్రత్యేక రైల్వే ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేయాలని దిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతోన్న సందర్భంగా దాదాపు 5వేల పడకల సామర్థ్యం కలిగిన ఐసోలైషన్ బోగీలను దిల్లీలో అందుబాటులో ఉంచాలని దిల్లీ సీఎస్ విజయ్ కుమార్ రైల్వే బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఇప్పటికే నగరంలోని ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా వీటిని అందుబాటులో ఉంచాలని కోరారు.
ఇదిలాఉంటే, దేశంలో గతేడాది కరోనా వైరస్ తొలిదఫా విజృంభణ సమయంలో రైల్వే శాఖ ప్రత్యేక ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేసింది. పలు రాష్ట్రాల్లో 813 కోచ్‌ల ద్వారా దాదాపు 12వేలకు పైగా పడకలను అందుబాటులో ఉంచింది. దిల్లీకి 503 కోచ్‌లు, ఉత్తర్ ప్రదేశ్‌లో 270 కోచ్‌లు, బిహార్‌లో 40కోచ్‌లతో పాటు పలు రాష్ట్రాలకు అవసరమైన ఐసోలేషన్ కోచ్‌లను రైల్వేశాఖ అందుబాటులో ఉంచింది. అయితే, వాటిలో ఎక్కువగా వినియోగించలేదని సమాచారం. తాజాగా మరోసారి కొవిడ్ ఉద్ధృతి పెరగడంతో మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు ఐసోలేషన్ బోగీలు కావాలని రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నాయి. వీటిలో స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్ రోగులను ఐసోలేషన్‌లో ఉంచడంతోపాటు మరికొన్ని బోగీల్లో ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ కలిసి సంయుక్తంగా చేపడుతాయి.
ఇవీ చదవండి
Advertisement