White Fungus: దిల్లీ ఆసుపత్రిలో తొలి కేసు

మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ఫంగస్‌) కేసులు విపరీతంగా పెరిగిపోతున్న వేళ.. ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న క్యాండిడా (వైట్‌ ఫంగస్‌) కేసు దిల్లీ ఆసుపత్రిలో నమోదయ్యింది

Published : 27 May 2021 19:22 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ఫంగస్‌) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న క్యాండిడా (వైట్‌ ఫంగస్‌) కేసు దిల్లీ ఆసుపత్రిలో నమోదయ్యింది. కరోనా వైరస్‌ సోకిన బాధితురాలిలో ఈ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జీర్ణకోశంలో చిల్లులు పడినట్లు వైద్యులు గుర్తించారు. దిల్లీలో నమోదైన తొలి క్యాండిడా ఇన్‌ఫెక్షన్‌ కేసు కూడా ఇదేనని వైద్యులు వెల్లడించారు.

‘మే 13వ తేదీన తీవ్ర కడుపునొప్పితో వచ్చిన ఓ 49ఏళ్ల ఓ మహిళ ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షల్లో ఆమె ఆహార నాళికల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించాం. పలు సర్జరీలు నిర్వహించిన తర్వాత పేగు నమూనాలను తదుపరి పరీక్షలకు పంపించాం. అనంతరం ఆమెకు వైట్‌ ఫంగస్‌ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారణకు వచ్చాం. క్యాండిడా (వైట్‌ ఫంగస్‌) ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జీర్ణకోశంలోని పేగులు ఛిద్రమైనట్లు గుర్తించాం’ అని దిల్లీలోని సర్‌గంగారాం ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ అనిల్‌ ఆరోరా తెలిపారు. ఇప్పటికే ఆ మహిళకు రెండు, మూడు సర్జరీలు నిర్వహించామని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడిన ఆ మహిళ గత డిసెంబరులో మాస్టెక్టమీ చేయించుకుందని.. నాలుగు వారాల పాటు కీమోథెరపీ చికిత్స తీసుకున్నట్లు గుర్తుచేశారు. కొవిడ్‌ నిర్ధారణ కావడం, కీమోథెరపీ తీసుకోవడం వల్ల ఆమెలో రోగనిరోధకత మరింత క్షీణించినట్లు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, దేశంలో మ్యూకర్‌మైకోసిస్‌ కేసులలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య దాదాపు 12వేలకు చేరింది. గడిచిన నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్యలో 32శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగించే విషయం. వీటిలో అత్యధికంగా గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. మధుమేహం, స్టెరాయిడ్లను అధికంగా వాడడమే మ్యూకర్‌మైకోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌కు కారణమని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని