Delta Variant: డెల్టాతో ఆసుపత్రి పాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికం

కరోనా వైరస్‌ పరివర్తనం ద్వారా ఉత్పన్నమైన ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే.. డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆసుపత్రి పాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని తాజా అధ్యయనం వెల్లడించింది.....

Published : 29 Aug 2021 01:28 IST

ప్యారిస్‌: కరోనా వైరస్‌ పరివర్తనం ద్వారా ఉత్పన్నమైన ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే.. డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆసుపత్రి పాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని తాజా అధ్యయనం వెల్లడించింది. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌లో కరోనా బారిన పడ్డ 43వేల మందిలో వైరస్ ప్రభావాన్ని పరిశీలించారు. అయితే ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా సోకిన రోగులు తీవ్ర లక్షణాలతో  ఇబ్బంది పడతారని గతంలో వెల్లడైన అంశాలను తాజా అధ్యయనం నిర్ధారించింది. టీకా తీసుకోని వారిలో డెల్టా వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపుతోందని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోనివారే ఎక్కువగా వ్యాధి బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ నుంచి టీకా మెరుగైన రక్షణ కల్పిస్తున్నట్లు నిరూపితమైందన్నారు.

ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 23 వరకు ఇంగ్లాండ్‌లో కరోనా బారిన పడ్డ దాదాపు 43,338 మందిలో వైరస్ ప్రభావాన్ని పరిశీలించగా అందులో 75 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నారని అధ్యయనం పేర్కొంది. 24 శాతం మంది ఒక్క డోసు తీసుకున్నవారని.. ఇందులో రెండు డోసులు తీసుకున్నవారు 1.8 శాతం మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. టీకా తీసుకోనివారు, పాక్షికంగా టీకా తీసుకున్నవారే ఎక్కువ శాతం ఆసుపత్రిలో చేరుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా గుర్తించినట్లు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అన్నే ప్రెసానిస్‌ వెల్లడించారు. మొదటిసారి వైరస్‌ సోకిన 50 మందిలో ఒకరు ఆసుపత్రిలో చేరుతున్నట్లు అధ్యయనం తెలిపింది. అయితే ఇలా ఆసుపత్రిలో చేరేవారిలో.. ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ సోకినవారు రెట్టింపుగా ఉంటున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

టీకా రెండు డోసులు తీసుకుంటే ఆసుపత్రిలో చేరే ప్రమాదం చాలా తక్కువ అని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆల్ఫాతోపాటు డెల్టా రకంపై వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని ఇంగ్లాండ్‌లోని ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్త గవిన్‌ డబ్రేరా తెలిపారు. రెండు డోసులు తీసుకోనివారు కచ్చితంగా తీసుకోవాలని ఆయన సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని