Coronavirus: అగ్రరాజ్యంలో 1.5 లక్షల కేసులు.. జపాన్‌లో ఎమర్జెన్సీ..

డెల్టా వేరియంట్ల విజృంభణతో పలు ప్రపంచ దేశాల్లో వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ... కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది....

Updated : 20 Aug 2021 20:16 IST

ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియంట్ల విజృంభణ

దిల్లీ: డెల్టా వేరియంట్ల విజృంభణతో పలు ప్రపంచ దేశాల్లో వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కొద్దిరోజులుగా ఒకటిన్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. జపాన్‌లోని కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సెప్టెంబర్ చివరి వరకూ లాక్‌డౌన్ పొడిగించారు.

ప్రపంచవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే ఏకంగా 7.23 లక్షల మందికి వైరస్‌ సోకింది. దాదాపు 11వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్‌ ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉంది. డెల్టా వేరియంట్లతో వైరస్‌ల బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అమెరికాలో గురువారం ఒక్కరోజే 1.54 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. 967 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లకు చేరింది.

జపాన్‌లోనూ కొవిడ్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. గతవారం సగటున రోజుకు 20వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ కట్టడి కోసం జపాన్‌ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది. సెప్టెంబర్‌ 12 వరకూ అత్యవసర పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని.. షాపింగ్‌ మాళ్లలో ప్రజలు గుమికూడకుండా చూడాలని స్పష్టం చేసింది. టోక్యో, ఒకినావా సహా మరో 13 ప్రాంతాలకు ఎమర్జెన్సీని విస్తరించాలని నిర్ణయించింది. మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక ఎమర్జెన్సీ అమల్లో ఉంటుంది.

ఆస్ట్రేలియాలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం న్యూ సౌత్‌వేల్స్‌లో 642 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజు 600లకు పైగా కేసులు వచ్చాయి. వైరస్‌ ఉద్ధృతితో సిడ్నీలో లాక్‌డౌన్‌ పొడిగించారు. సెప్టెంబర్‌ చివరివరకు ఆంక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించడం, కర్ఫ్యూ వంటి కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని