లఖ్‌నవూ: 600 పడకలతో డీఆర్‌డీవో ఆస్పత్రులు!

యూపీలో కొవిడ్‌ ఉద్ధృతి ధాటికి భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మహమ్మారిపై పోరులో శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు..

Published : 16 Apr 2021 23:50 IST

లఖ్‌నవూ: యూపీలో కొవిడ్‌ ఉద్ధృతి ధాటికి భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మహమ్మారిపై పోరులో శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు, వ్యక్తిగత రక్షణ సాధనాలతో పాటు సొంత ఫార్ములాలతో వెంటిలేటర్లను అభివృద్ధి చేసి జాతికిచ్చింది. తాజాగా కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న యూపీ రాజధాని లఖ్‌నవూలో మరో కీలక అడుగు వేయనుంది. ఇక్కడ మొత్తం 600 పడకల సామర్థ్యంతో రెండు కొవిడ్‌ ఆస్పత్రులను నిర్మించనుంది. ఈ మేరకు ఓ సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్‌డీవోకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. యుద్ధప్రాతిపదికన లఖ్‌నవూలోని వేర్వేరు ప్రాంతాల్లో 250-300 పడకల సామర్థ్యంతో రెండు ఆస్పత్రులు నిర్మించాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో డీఆర్‌డీవో బృందం శుక్రవారం లఖ్‌నవూలో పర్యటించింది. 

మరోవైపు లఖ్‌నవూలో కొంతకాలంగా 35 వేల యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు ఉంటున్నాయి. యూపీలోని మరో పది జిల్లాల్లోనూ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఇప్పటికే రాత్రి కర్ఫ్యూతో పాటు వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. గురువారం ఒక్కరోజే యూపీలో 22,339 మంది కరోనా బారిన పడ్డారు. మరో 104 మంది మృత్యు ఒడికి చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని