నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్‌ 

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

Updated : 06 Apr 2021 09:54 IST

కొచ్చి: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మరోవైపు అసోం, బెంగాల్‌ శాసనసభలకు మూడో దశ  పోలింగ్‌ జరుగుతోంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొత్తం 475 స్థానాల్లో 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్‌ రెండోదశ విజృంభిస్తుండటంతో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. 

బెంగాల్‌లో 31 స్థానాలకు
బెంగాల్‌ అసెంబ్లీకి మూడో దశలో భాగంగా 31 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మూడో దశలో భాగంగా ఇక్కడ 31 స్థానాలకు గానూ 205 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం కానుంది.  గత ఎన్నికల్లో ఈ 31 స్థానాల్లో తృణమూల్‌ 29 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రోజు జరిగే ఎన్నికల్లో భాజపా సీనియర్‌ నేత స్వపన్‌దాస్‌ గుప్తా తారకేశ్వర్‌ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ప్రముఖ నటి తనుశ్రీ చక్రవర్తి శ్యామ్‌పూర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 

తమిళనాడు బరిలో 3,998 మంది
తమిళనాడులో నేడు ఒకే దశలో 234 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు క్రమంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.28 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు భారీగా ఉచిత హామీలు ప్రకటించాయి.

కేరళలో 140 స్థానాల్లో.. 957 మంది
కేరళలోనూ 140 స్థానాలకు గానూ నేడు ఒకే దశలో పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.74 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల అధికారులు ఇప్పటికే పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. భాజపా నేత, మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ తాను పోటీలో ఉన్న పాలక్కడ్‌ లోని పొన్నాని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. నేటి పోలింగ్‌లో కేరళలో 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

అసోంలో 40 స్థానాలకు
అసోంలో నేడు చివరి దశ పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 40 స్థానాలకు పోలింగ్‌ మొదలైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. అసోంలో మొత్తం 40 స్థానాలకు 337 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 

పుదుచ్చేరిలో 30 స్థానాలకు
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో నేడు ఒకే దశలో 30 స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ సజావుగా జరిగేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా 10,04,197 మంది ఓటర్లు ఉన్నారు. పుదుచ్చేరిలో అధికారం కైవసం చేసుకునేందుకు ఎన్డీయే ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని