‘రద్దు’కే రైతన్నలు.. కష్టమన్న కేంద్రం

వ్యవసాయ చట్టాలపై కేంద్ర, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసా...గుతూనే ఉంది. చట్టాల రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు పట్టుబట్టగా.. అది మాత్రం కుదరదని కేంద్రం చెబుతోంది. దీంతో ఎనిమిదో విడత చర్చలు

Updated : 08 Jan 2021 18:23 IST

కొనసాగుతున్న ప్రతిష్టంభన: 15న మళ్లీ చర్చలు

దిల్లీ: వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసా...గుతూనే ఉంది. చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు పట్టుబట్టగా.. అది మాత్రం కుదరదని కేంద్రం చెబుతోంది. దీంతో ఎనిమిదో విడత చర్చలు కూడా ఫలించలేదు. చట్టాలను ఉపసంహరించుకుంటేనే తాము ఇళ్లకు వెళ్తామని రైతులు ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో తదుపరి దఫా చర్చలను జనవరి 15వ తేదీకి వాయిదా వేశారు.

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న 41 రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్‌ శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అయితే చర్చలు ప్రారంభమైన కాసేపటికే ఇరు వర్గాలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. కొత్త చట్టాలను దేశ ప్రజలందరి కోసం తీసుకొచ్చామని, ఇవి ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కావని మంత్రుల బృందం తెలిపింది. చట్టాలను రద్దు చేయడం కుదరదని చెప్పినట్లు సమాచారం. ‘చట్టాలను రద్దు చేయలేం. కావాలంటే మీరు సుప్రీంకోర్టు వెళ్లొచ్చు. ఈ చట్టాలు అక్రమమని న్యాయస్థానం చెబితే మేం ఉపసంహరించుకుంటాం. ఒకవేళ చట్టబద్ధమైనవేనని తీర్పు వస్తే మీరు ఉద్యమాన్ని విరమించుకోవాలి’ అని మంత్రుల బృందం రైతులకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇందుకు రైతు నాయకులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. సుప్రీం ప్రక్రియకు చాలా సమయం పడుతుందన్న రైతు ప్రతినిధులు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ‘చట్టాలను వెనక్కి తీసుకుంటేనే మేం ఇళ్లకు వెళ్లిపోతాం’ అని రైతులు చెప్పినట్లు సదరు వర్గాలు తెలిపాయి.

ఏకాభిప్రాయం కుదరలేదు: తోమర్‌

రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. చట్టాలు రద్దు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం చెప్పాలని రైతులను కోరామన్నారు. దేశంలో చాలా మంది చట్టాలను సమర్థిస్తున్నారని, రైతులతో మరోసారి ఈ నెల 15న చర్చలు జరుపుతామని మంత్రి తెలిపారు. 

ప్రజాస్వామ్యం అపహాస్యం: రైతులు

‘‘కేంద్రం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. చర్చల్లో సాగు చట్టాల రద్దు కుదరని చెప్పింది. ఇతర రైతు సంఘాలు సాగు చట్టాలకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి చట్టాలను వెనక్కి తీసుకోలేమని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయానికే వదిలేస్తే మంచిదని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. చర్చలు జరుగుతున్న వేళ కేంద్రం మధ్యలో తప్పుకొని సుప్రీంకోర్టు తేలుస్తుందని అనడం దేనికి నిదర్శనం? సాగు చట్టాల రద్దు తప్ప మరేదీ ఆమోద యోగ్యం కాదని చెప్పాం. సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తాం’’ అని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నేత కవిత కురుగంటి అన్నారు.

హాలు నుంచి వచ్చేసిన మంత్రులు

రైతులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర మంత్రులు సమావేశ గది నుంచి బయటకు వచ్చేశారు. అధికారులతో సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో రైతు సంఘాల నేతలు గదిలో మౌనం పాటించారు. ‘విజయం లేదా వీరమరణం’ అనే రాసి ఉన్న పేపర్లు పట్టుకుని నిరసన తెలిపారు. అంతేగాక, భోజనం చేసేందుకు కూడా రైతులు నిరాకరించారు. భోజన విరామ సమయంలోనూ సమావేశ గదిలోనే ఉండిపోయారు.

ఇవీ చదవండి..

ఆర్మీ క్యాంటీన్‌ వస్తువలు ఇకపై ఆన్‌లైన్‌లో..

స్ట్రెయిన్‌ ఆందోళన.. బ్రిటన్‌ నుంచి విమానం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని