Updated : 03/12/2021 13:33 IST

Omicron: బూస్టర్‌ డోసులపై అయోమయం.. టీకా నిపుణుల భిన్నాభిప్రాయాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. నెమ్మదిగా ప్రపంచదేశాలకు పాకుతోంది. భారత్‌లోనూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ వైరస్‌ను ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లు సమర్థంగా అడ్డుకోగలవా? లేదా? అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ కొవిడ్‌ వ్యాక్సిన్లతోపాటు బూస్టర్‌ డోసు కూడా తీసుకోవాలని పలువురు టీకా, వైద్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వ్యాక్సిన్ల కోసం ఎదురుచూడకుండా ఎంత వీలైతే అంత తొందరగా బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్‌ను కట్టడి చేయొచ్చని అంటున్నారు. మరోవైపు బూస్టర్‌ డోసులపై పులువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు బూస్టర్‌ డోసులు అత్యవసరమని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఒమిక్రాన్‌.. భవిష్యత్తులో వచ్చే ఇతర వేరియంట్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని మాయో క్లినిక్స్‌ వ్యాక్సిన్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ గ్రెగోరీ పోలాండ్‌ తెలిపారు. ‘బూస్టర్‌ డోసు ఒమిక్రాన్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేం.. కానీ, కొత్త వేరియంట్‌ను అడ్డుకునేందుకు కొవిడ్‌ నిబంధనలతోపాటు బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం ఒక్కటే మార్గం’ అని ఇంటర్నేషనల్‌ వ్యాక్సిన్‌ యాక్సిస్‌ సెంటర్‌కు చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ అడల్ట్‌ వ్యాక్సిన్‌ లూయిస్‌ ప్రివొర్‌-డమ్‌ చెప్పారు. ఒమిక్రాన్‌ తీవ్రత గురించి పూర్తిగా తెలియదు కాబట్టి.. ఎలాంటి రక్షణ లేకుండా ఉండటం కంటే.. బూస్టర్‌ డోస్‌ తీసుకొని కొంతమేర రక్షణ పొందడం ఉత్తమమని లూయిస్‌ అభిప్రాయపడ్డారు.

‘వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసులు వైరస్‌పై పోరాటం చేసేలా శరీరంలో యాంటీ బాడీలను, టి-కణాలను ప్రేరేపిస్తాయి. ఈ యాంటీబాడీలు ఒమిక్రాన్‌ వైరస్‌ను బంధించడంలో బలహీనంగా ఉన్నా.. ఒమిక్రాన్‌ వ్యాప్తిని తగ్గించగలవు’’అని యేలే స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ఇమ్యూనోబయాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న అకికో ఇవసాకి వెల్లడించారు. ఒకవేళ ఒమిక్రాన్‌ను నియంత్రించడానికి కొత్త ఔషధాలు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. బూస్టర్‌ డోసును నిలిపివేయవద్దని, కొత్త బూస్టర్‌ డోసులను తయారు చేయాలని యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో మెడిసిన్‌లో హాస్పిటల్‌ ఎపిడర్మటాలజిస్ట్‌ చీఫ్‌ ఎమిలీ లండన్‌ సూచించారు.

బూస్టర్‌ డోసుపై పలువురు నిపుణుల అభ్యంతరం

మెజార్టీ నిపుణులు బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచిస్తుంటే.. మరికొందరు వైద్య నిపుణులు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారిలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మెడిసిన్‌ అండ్‌ ఇన్‌ఫెక్షిసియస్‌ డీసీజెస్‌ ప్రొఫెసర్‌గా ఉన్న మోనికా గాంధీ కూడా ఉన్నారు. ‘‘బూస్టర్‌ డోసులు 65 ఏళ్లు ఆ పైబడిన వయస్కుల వారికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటాయి. ఎందుకంటే ఒమిక్రాన్‌ వైరస్‌ గురించి ఎవరికీ పూర్తి అవగాహన రాలేదు. అలాంటప్పుడు అందరూ బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించడం సరికాదు. యువతపై బూస్టర్‌ డోసు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది’’అని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని పిల్లల ఆస్పత్రిలో ఉన్న వ్యాక్సిన్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ పాల్‌ ఓఫిట్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్లు లేదా బూస్టర్‌ డోసులు తీసుకునే యువతలో మయోకార్డిటిస్‌(హృదయ కండరాల వాపు) వచ్చే అవకాశముందని హెచ్చరించారు.

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని