
Kabul Airport: కాబుల్ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్లు.. 13 మంది మృతి
కాబుల్ (అఫ్గానిస్థాన్): అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రెండు చోట్ల జంట పేలుళ్లు సంభవించాయి. అఫ్గాన్ నుంచి పలు దేశాలు తమ దేశ పౌరులను తరలిస్తున్న వేళ గురువారం సాయంత్రం ఈ దుర్ఘటనలో 12 మంది అమెరికా రక్షణ సిబ్బందితో పాటు 72 మంది పలువురు పౌరులు చనిపోయారు. 72 మంది మృతిచెందారని అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఐఎస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడ్డుట్లు యూఎస్ తెలిపింది. బాంబు దాడులు జరిగినా కాబుల్ నుంచి తరలింపు ప్రక్రియ ఆగదని అమెరికా పేర్కొంది.
కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అబే గేటు వద్ద తొలి పేలుడు చోటుచేసుకోగా.. కొద్దిసేపటికే విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్ వద్ద రెండో పేలుడు సంభవించడంతో ఆ పరిసర ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది. రక్తమోడుతూ ప్రాణాలు రక్షించుకొనేందుకు క్షతగాత్రులు ఆసుపత్రికి పరుగులు పెడుతున్న దృశ్యాలు కనిపించాయి. కాబుల్ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరగొచ్చని ముందు నుంచీ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా అనుమానిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెంటగాన్ అధికారులు సమాచారమిచ్చారు.
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. తాలిబన్లు
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ విమానాశ్రయం వెలుపల జరిగిన జంట పేలుళ్ల ఘటనను తాలిబన్లు ఖండించారు. అమెరికా బలగాల నియంత్రణలో ఉన్న ప్రాంతంలోనే ఈ దాడి జరిగినట్టు వెల్లడించారు. ఈ మేరకు తాలిబన్ అధికారప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. తమ గ్రూపు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భద్రతపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పారు.
మరోవైపు, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లతో వేరుపడి వారి కన్నా మరింత ప్రమాదకరమైన ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ ఆత్మాహుతి దాడుల్లో 13మంది మృతి చెందగా.. 15మంది గాయపడినట్టు రష్యాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
కాబుల్ పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్
కాబుల్ పేలుళ్ల సంఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు భారత విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకతాటిపై నిలవాలని భారత్ పిలుపునిచ్చింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా కాబుల్ పేలుళ్లను ఖండించింది. ఈ ఘటన అఫ్గాన్‌లో దారుణ పరిస్థితిని తెలియజేస్తోందని పేర్కొంది.
ఇవీ చదవండి
Advertisement