Facebook: ఫేస్‌బుక్‌లో మళ్లీ సమస్య.. వారంలో ఇది రెండోసారి..

ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో శుక్రవారం కొద్ది గంటల పాటు ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌ సేవలు నిలిచిపోయాయి.

Published : 09 Oct 2021 10:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో శుక్రవారం కొద్ది గంటల పాటు ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌ సేవలు నిలిచిపోయాయి. అయితే సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం యథావిధిగా సేవలు కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడించింది. వినియోగదారులను అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు తెలిపింది. 

కాన్ఫిగరేషన్‌ మార్పుల్లో జరిగిన పొరబాటు కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లకు ఫేస్‌బుక్‌కు చెందిన కొన్ని యాప్‌ల సేవలు కొంతసేపు నిలిచిపోయాయి. కొంతమంది యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీడ్ రాలేదు. మరికొందరికి మెసెంజర్‌ నుంచి సందేశాలు వెళ్లలేదు. దీంతో ఆయా యూజర్లు ట్విటర్‌ వేదికగా సమస్యను బయటపెట్టడమే గాక.. ఫేస్‌బుక్‌పై విమర్శలు గుప్పించారు.

దీంతో కంపెనీ స్పందించి క్షమాపణలు తెలిపింది. ‘‘రెండు గంటల పాటు మా యాప్‌ సేవల్లో అంతరాయం కలిగినందుకు గానూ యూజర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. సమస్యను పరిష్కరించాం. ఇప్పుడు సేవలు సాధారణ స్థితికి వచ్చేశాయి. క్లిష్టపరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన వినియోగదారులకు కృతజ్ఞతలు’’ అని కంపెనీ తెలిపింది. 

అయితే సాంకేతిక సమస్య కారణంగా ఫేస్‌బుక్‌కు చెందిన యాప్‌ సేవలు నిలిచిపోవడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గత సోమవారం ఇదే కాన్ఫిగరేషన్‌ మార్పుల సమస్య కారణంగా దాదాపు ఆరు గంటల పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సేవలు నిలిచిపోవడంతో ఫేస్‌బుక్‌పై యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘చూస్తుంటే ఫేస్‌బుక్‌ వారానికి మూడు రోజులే పనిచేస్తున్నట్లుంది’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని