
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై కాపీరైట్ ఉల్లంఘన కేసు
ముంబయి: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ముంబయిలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద.. సుందర్ పిచాయ్ సహా గూగుల్ సంస్థలోని మరో ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. బాలీవుడ్ దర్శక-నిర్మాత సునీల్ దర్శన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాను దర్శకత్వం వహించి, నిర్మించి 2017లో విడుదల చేసిన ‘ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా’ సినిమా హక్కులను ఎవరికీ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్న సునీల్ దర్శన్.. కానీ గూగుల్ సంస్థ ఆధీనంలోని యూట్యూబ్‌లో ఆ చిత్రాన్ని అప్లోడ్ చేశారని వెల్లడించారు. ఈ సినిమా తన మేధో సంపత్తి అని.. కానీ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో తన సినిమాను అప్లోడ్ చేసి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని యూట్యూబ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఎలాంటి స్పందనా లేదని పేర్కొన్న ఆయన తాజాగా కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కాగా సునీల్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు పిచాయ్ సహా అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. ప్రపంచ అగ్రగామి సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సీఈఓ అయిన సుందర్ పిచాయ్‌కు భారత ప్రభుత్వం తాజాగా పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని ప్రకటించిన మరుసటి రోజే సుందర్ పిచాయ్‌పై కేసు నమోదవడం గమనార్హం.