
Bhopal Hospital Fire: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు పసి పిల్లల మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి నలుగురు పసి పిల్లలు సజీవదహనమయ్యారు. స్థానిక కమలా నెహ్రూ చిల్డ్రెన్ హాస్పిటల్‌లో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇదే అంతస్తులో స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్‌ఎన్‌సీయూ) ఉంది. మంటలు వేగంగా వ్యాపించి ఐసీయూను చుట్టుముట్టాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఘటన సమయంలో ఎన్‌ఎన్‌సీయూలో 40 మంది శిశువులు ఉండగా.. వీరిలో 36 మంది పిల్లలను పక్కవార్డుకు తరలించారు. మరో నలుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా.. మంటలు చెలరేగినప్పుడు చిన్నారులను కాపాడాల్సిన ఆసుపత్రి సిబ్బంది అందరికంటే ముందే బయటకు పరుగులు పెట్టారని చిన్నారుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి
Advertisement