‘నాన్నా..! బయటకు రా.. నిన్నేం చేయరు’

‘‘అబ్బూ జీ నేను అబ్రర్‌ను. మీరు బయటకు రండి. వీళ్లు మిమ్మల్ని ఏం చేయరు. బయటకు రండి నాన్నా..! నాకు మీరు చాలా గుర్తొస్తున్నారు’’.. ఉగ్రవాది అయిన తన తండ్రి కోసం నాలుగేళ్ల చిన్నారి పడుతున్న ఆవేదన

Published : 23 Mar 2021 12:13 IST

శ్రీనగర్‌: ‘‘అబ్బూ జీ నేను అబ్రర్‌ను. మీరు బయటకు రండి. వీళ్లు మిమ్మల్ని ఏం చేయరు. బయటకు రండి నాన్నా..! నాకు మీరు చాలా గుర్తొస్తున్నారు’’.. ఉగ్రవాది అయిన తన తండ్రి కోసం నాలుగేళ్ల చిన్నారి పడుతున్న ఆవేదన ఇది..! జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ముష్కరులు హతమైన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఉగ్రవాదులను లొంగిపొమ్మని వారి కుటుంబసభ్యులతో పోలీసులు విజ్ఞప్తి చేయించారు. అకిబ్‌ అహ్మద్‌ మాలిక్‌ అనే ఉగ్రవాది భార్య, కుమారులను ఘటనాస్థలానికి తీసుకొచ్చారు. 

మాలిక్‌ భార్య మైక్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. ‘‘దయచేసి లొంగిపో. నాతో పాటు మన పిల్లలు కూడా వచ్చారు. నీకు బయటకు రావాలని లేకపోతే ముందు మమ్మల్ని కాల్చి చంపేయ్‌’’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత వారి నాలుగేళ్ల కొడుకు అబ్రర్‌ తన తండ్రిని లొంగిపొమ్మని కోరాడు. ఈ హృదయ విదారక వీడియోను ఆర్మీ చినార్‌ కోర్‌ గ్రూప్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.  

ఈ ఘటనపై ఆర్మీ అధికారులు స్పందిస్తూ..‘‘ఉగ్రవాదులు లొంగిపోవాలని వారి కుటుంబసభ్యులతో విజ్ఞప్తి చేయించాం. భార్యా, కుమారుడి మాటలు విన్న తర్వాత మాలిక్‌ బయటకు రావాలని అనుకున్నా.. తోటి ఉగ్రవాదులు అతడిని రానివ్వలేదని మాకు సమాచారం వచ్చింది. ఒకవేళ అతడు లొంగిపోయి ఉంటే అతడిని మేం కాపాడేవాళ్లం’’ అని చెప్పారు. బ్యాంకు ఉద్యోగి అయిన 25ఏళ్ల మాలిక్‌ డిసెంబరు 20 నుంచి కన్పించకుండా పోయాడు. ఆ తర్వాత అతడు ఉగ్రవాదుల్లో చేరాడు.

షోపియాన్‌ జిల్లాలోని మనిహాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిపై సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆదివారం రాత్రి నుంచి గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఓ ఇంట్లో నక్కిన ముష్కరులు భద్రతాదళాలపై కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలం నుంచి మూడు పిస్టోళ్లు, ఒక ఏకే శ్రేణి రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని