
ప్రెసిడెంట్ వార్నింగ్.. క్యూ కట్టిన ప్రజలు!
పారిస్: ఫ్రాన్స్‌లో మంగళవారం రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌లు జరిగాయి. ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు చేసిన హెచ్చరికే కారణమట. ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలం పాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. గత నెలలోనే ఆంక్షలు సడలించి.. అన్ని కార్యకలాపాలకు అనుమతులిచ్చారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు డెల్టా వేరియంట్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలను ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. వ్యాక్సిన్ వాయించుకోవాలని కోరుతోంది. కానీ, స్పందన అంతంత మాత్రమే వస్తుండటంతో సోమవారం రాత్రి ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మేక్రాన్ ప్రజలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
ఆగస్టు నుంచి కేఫ్స్, షాపింగ్‌మాల్స్, బార్లకు వెళ్లాలంటే వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చే ‘హెల్త్‌కార్డ్’ తప్పనిసరిగా చూపించాల్సిందేనని మేక్రాన్ స్పష్టం చేశారు. దీంతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకున్నారు. మంగళవారం ఒక్క రోజే 17లక్షల మంది తమ తొలి డోసు వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. నిజానికి ఫ్రాన్స్‌లో రోజువారీ వ్యాక్సినేషన్ సగటు 5.7లక్షల డోసులు మాత్రమే. అధ్యక్షుడి తాజా హెచ్చరిక నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం అవుతోందని అధికార యంత్రాంగం ఆశిస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 41శాతం మంది వ్యాక్సినేషన్ వేయించుకోగా.. రోజువారీగా దాదాపు 4వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా 58.20లక్షల కేసులు నమోదు కాగా.. 1.11లక్షల మంది మృతి చెందారు. 5.46లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.