Gautam Gambhir: బెదిరింపులకు భయపడను: గౌతమ్‌ గంభీర్‌

మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన గౌతమ్‌ గంభీర్‌.. ఈ బెదిరింపులకు భయపడనని అన్నారు. ఈ కేసుపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. బెదిరింపుల దృష్ట్యా గౌతమ్‌ గంభీర్‌కు పోలీసులు భద్రత

Published : 02 Dec 2021 01:37 IST

దిల్లీ: మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన గంభీర్‌.. ఇలాంటి బెదిరింపులకు భయపడనన్నారు. ఈ కేసుపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. బెదిరింపుల దృష్ట్యా గంభీర్‌కు భద్రత పెంచారు. అయినా.. అతడు అవేవి పట్టించుకోకుండా యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు వెళ్లి ఈస్ట్‌ దిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంభీర్‌ మాట్లాడుతూ ‘నాకు ఎలాంటి భయం లేదు. నేను చేస్తున్న పనిని ఆపను. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటా. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ లీగ్‌ను విజయవంతం చేయడంపైనే ఉంది’’అని చెప్పుకొచ్చారు.     

గంభీర్‌తోపాటు ఆయన కుటుంబానికి ప్రాణహాని తలపెడతామంటూ కొన్ని రోజుల కిందట తొలిసారిగా ఆయనకు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. ఆ తర్వాత గంభీర్‌ ఇంటి వీడియో జతచేసిన మరో మెయిల్‌ వచ్చింది. ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ పేరుతో వస్తోన్న ఈ-మెయిల్‌ బెదిరింపులపై అప్పుడే గౌతమ్‌ గంభీర్‌ వ్యక్తిగత కార్యదర్శి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల కిందట మరోసారి బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చినట్లు గౌతమ్‌ గంభీర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘ఈ కేసుకు సంబంధించి మీ దిల్లీ పోలీసులు, ఐపీఎస్‌ శ్వేతా (డీసీపీ) ఏమీ సాధించలేరు. పోలీసుల్లోనూ మా గూఢచారులు ఉన్నారు. మీ గురించి సమాచారమంతా మాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది’ అని ఐఎస్‌ఐఎస్‌ - కశ్మీర్‌ పేరుతో ఉన్న ఈ-మెయిల్‌ ఐడీ నుంచి మూడోసారి బెదిరింపులు వచ్చాయి. ఆ ఈ-మెయిళ్ల సోర్స్‌ పాక్‌లో ఉన్నట్లు గుర్తించిన భద్రతా వర్గాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.  

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని