సులేమాని మృతి.. సంబరాల్లో ఇరాకీలు

ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సులేమానిను అమెరికా హతమార్చడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. అమెరికా చర్యకు ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌ గట్టి హెచ్చరికలే చేసింది. అయితే సులేమాని

Updated : 03 Jan 2020 16:51 IST

వీడియో పోస్ట్‌ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి

వాషింగ్టన్‌: ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సులేమానిని అమెరికా హతమార్చడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. అమెరికా చర్యకు ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌ గట్టి హెచ్చరికలే చేసింది. అయితే సులేమాని మృతిపై ఇరాక్‌లో మాత్రం హర్షాతిరేకాలు వెల్లువెత్తినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో కూడా పోస్టు చేశారు. 

ఆ వీడియోలో కొందరు యువకులు ఇరాక్‌ జాతీయ జెండా పట్టుకుని ఆనందంతో వీధుల్లో పరిగెత్తుతున్నట్లుగా ఉంది. ‘ఇరాకీలు.. ఇరాకీలు.. సులేమాని ఇక లేడని తెలిసి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆనందంలో వీధుల్లో డ్యాన్స్‌ చేస్తున్నారు’ అని పాంపియో ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో సోర్స్‌ గానీ.. ఎక్కడ చిత్రీకరించారన్న వివరాలను మాత్రం పాంపియో వెల్లడించలేదు. 

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా జరిపిన రాకెట్‌ దాడుల్లో ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హతమైన విషయం తెలిసిందే. ఈ దాడికి పెంటగాన్‌ ధ్రువీకరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు సులేమానిను హతమార్చినట్లు వెల్లడించింది. విదేశాల్లో ఉన్న తమ సిబ్బందిని రక్షించుకునేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇరాక్‌, ఇతర ప్రాంతాల్లో అమెరికా దౌత్యవేత్తలు, సిబ్బందిపై దాడులకు జనరల్‌ సులేమాని కీలక ప్రణాళికలు రచించేవారని పేర్కొంది. ఇటీవల బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై జరిగిన దాడిని కూడా సులేమాని చేయించాడని తెలిపింది. కాగా.. అమెరికా చర్యకు ఇరాన్‌ దీటుగా బదులిచ్చింది. ‘తీవ్ర పత్రీకార దాడి’ తప్పదని ఆ దేశ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖొమైనీ హెచ్చరించారు. 

 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని