నిన్న కోట.. నేడు రాజ్‌కోట్‌

రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ ఆస్పత్రిలో నెల వ్యవధిలో 100 మందికిపైగా శిశువులు మృత్యువాత పడిన ఘటన మరవకముందే అలాంటి ఉదంతమే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో.......

Published : 05 Jan 2020 22:31 IST

అహ్మదాబాద్‌: రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ ఆస్పత్రిలో నెల వ్యవధిలో 100 మందికిపైగా శిశువులు మృత్యువాత పడిన ఘటన మరవకముందే అలాంటి ఉదంతమే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో వెలుగు చూసింది. గతేడాది ఒక్క డిసెంబర్‌ నెలలో ఇక్కడ 111 మంది చిన్నారులు మరణించారు. ఇక్కడి పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రిలోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించిన చిన్నారులను ఇక్కడకు రెఫర్‌ చేయడం వల్ల శిశు మరణాలు పెరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మనీశ్‌ మెహతా తెలిపారు. దీనికి తోడు తక్కువ బరువుతో శిశువులు జన్మించడం కూడా మరో కారణమని వివరించారు. ఇలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు నెలవారీ సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం ఒక్క డిసెంబర్‌ నెలలో 85 మంది చిన్నారులు చనిపోయారని అక్కడి సూపరింటెండెంట్‌ జీహెచ్‌ రాఠోడ్‌ తెలిపారు. ఈ ఘటనలపై ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి నితిన్‌పటేల్‌ మాట్లాడుతూ.. శిశు మరణాల సంఖ్య 1000కి 30గా ఉందని తెలిపారు. పోషకాహారలేమి, నెలలు గడకముందే జన్మించడం, ఆస్పత్రికి గర్భిణులు సకాలంలో చేరుకోకపోవడం వంటి కారణాల వల్ల ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని