ఈ వంతెన ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తైనది!

భారతీయ రైల్వే జమ్మూకశ్మీర్‌లో చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం దిశగా ముందుకెళ్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణాన్ని ప్రారంభించి వడివడిగా అడుగులు వేస్తోంది. కేంద్ర మంత్రి

Published : 13 Jan 2020 01:11 IST

దిల్లీ: భారతీయ రైల్వే జమ్మూకశ్మీర్‌లో చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం దిశగా ముందుకెళ్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణాన్ని ప్రారంభించి వడివడిగా అడుగులు వేస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. భారత రైల్వే ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వేను నిర్మిస్తోందని తెలిపారు. భారత దళాలకు ఇదో వ్యూహాత్మక ఆస్తిగా పేర్కొన్నారు. కశ్మీర్‌ లోయలోని చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే వంతెన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న ఈఫిల్‌ టవర్‌ కన్నా దాదాపు 30 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంటుందని సమాచారం. నదిపై 359 మీటర్ల ఎత్తు, 1.3 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే వంతెన కశ్మీర్‌ లోయలోని రియాసీ జిల్లాలో మారుమూల గ్రామాలను కలుపుతుంది. 

రూ.12వేల కోట్లతో కొంకణ్‌ రైల్వే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టింది. 2004లో ప్రారంభమైన ఈ వంతెన పనులు అధిక గాలుల ప్రభావంతో భద్రతా కారణాల దృష్ట్యా 2008లో నిలిచిపోయాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకోగలదని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. దాదాపు దీని జీవిత కాలం 120 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. కాట్రా, బనిహాల్‌ ప్రాంతాల మధ్య ఈ వంతెన కీలక మార్గం కానుంది. నదికి రెండు చివరల్లో కాకుండా మధ్యలో ఎలాంటి సపోర్టు లేకుండా ఉన్న వంతెనల్లో ఇది ప్రపంచంలోనే ఏడోది కానుండటం విశేషం. ఈ వంతెన పూర్తయిన అనంతరం భారత రైల్వే దీని మీది నుంచి బంగీ జంప్‌ వంటి సాహస కృత్యాలు నిర్వహించాలని యోచిస్తోందని అధికారులు తెలిపారు. ట్రెక్కింగ్‌ మార్గాలు, సందర్శన స్థలాల్లో పర్యాటకుల కోసం హోటళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని