
జమ్మూలో హిజ్బుల్ కీలక ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన ఓ కీలక ముష్కరుడిని భారత భద్రతా దళాలు బుధవారం మట్టుబెట్టాయి. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో ఒక ఉగ్రవాది తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి ఆపరేషన్ చేపట్టిన దళాలు హిజ్బుల్కు చెందిన కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదిని హరూన్ వానీగా గుర్తించారు. ఇతడు జిల్లాలోని గట్టా బెల్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. హతమైన ఉగ్రవాది వెంట ఉన్న మరో వ్యక్తి తప్పించుకున్నాడు. అతడి కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఘటనాస్థలం నుంచి ఒక ఏకే 47, మూడు మ్యాగజైన్లు, 73 రౌండ్లు, చైనీస్ గ్రనేడ్, రేడియో సెట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Advertisement