పోహాపై దుమారం.. భాజపా నేతపై విమర్శలు

అటుకులతో చేసే అల్పాహారం ‘పోహా’పై  మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. దాన్ని తిన్నంత మాత్రన ఒక దేశ పౌరులుగా.....

Published : 25 Jan 2020 00:41 IST

ఇండోర్‌: అటుకులతో చేసే అల్పాహారం ‘పోహా’పై  మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. దాన్ని తిన్నంత మాత్రన ఒక దేశ పౌరులుగా ఎలా అంచనా వేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన తీరుపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

సీఏఏకు మద్దతుగా గురువారం ఇండోర్‌లో నిర్వహించిన సదస్సులో భాజపా ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి నిర్మాణ పనికి వచ్చిన కూలీల ఆహార నియమాలు భిన్నంగా ఉన్నాయని, వారు పోహా తినడం బట్టి వారు బంగ్లాదేశీయులని అర్థమవుతోందన్నారు. తాను అనుమానించిన రెండు రోజుల తర్వాత వారు పనికి రావడం మానేశారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని, ప్రజలను హెచ్చరించడానికే ఇది చెబుతున్నానని పేర్కొన్నారు.

కూలీలు పోహా తినడంపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆహార నియమాలను బట్టి వారి జాతీయతను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోహాను ఇవాళ అల్పాహారంగా తీసుకుంటున్నారని, అంతమాత్రాన అందరూ బంగ్లాదేశీయులు అయిపోతారా? అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ‘బర్గర్‌ తినే వారు అమెరికన్‌ అయిపోతారా?’, ‘నేను రోజూ పోహా తింటున్నా. అయితే నేనూ అక్రమ వలసదారేనన్నమాట’, ‘కూలీలు పోహా కాకపోతే.. బటర్‌ చికెన్‌ తింటారా?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని