బెయిలిస్తున్నాం.. సమాజ సేవ చేయండి..!

గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో జరిగిన సర్దార్‌పుర మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మొత్తం 17 మందిని రెండు గ్రూపులుగా విభజించింది..........

Published : 28 Jan 2020 17:16 IST

సర్దార్‌పుర మారణహోమం దోషులకు బెయిల్‌

దిల్లీ: గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో జరిగిన సర్దార్‌పుర మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మొత్తం 17 మందిని రెండు గ్రూపులుగా విభజించింది. ఒక గ్రూప్‌ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు, మరో గ్రూప్‌ను జబల్‌పూర్‌ వెళ్లాలని ఆదేశించింది. అక్కడ వారానికి కనీసం ఆరు గంటలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 

నిందితులు ఉండబోయే ఇండోర్‌, జబల్‌పూర్‌ ప్రాంతాల్లో వారికి ఉపాధి మార్గాన్ని చూపాలని ఆయా జిల్లాల యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. వారానికి ఓసారి స్థానిక పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేయాలని దోషులకు తెలిపింది. అలాగే దోషులు కోర్టు నిబంధనల్ని ఉల్లంఘించకుండా ‘డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌’ ఎప్పటికప్పుడు వారిపై నిఘా ఉంచాలని ఆదేశించింది. మూడు నెలలు గడిచిన తర్వాత వారి వ్యవహారశైలిపై నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌ని కోరింది.

గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో 2002లో సర్దార్‌పుర అనే గ్రామంలో ఓ వర్గానికి చెందిన 33 మందిని మరోవర్గం సజీవ దహనం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం 2002లో 73 మందిపై అభియోగాలు మోపింది. దీనిపై విచారణ జరిపిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు 2012లో 31 మందిని దోషులుగా తేల్చింది. ఈ తీర్పుని గుజరాత్‌ హైకోర్టులో సవాల్‌ చేయగా.. సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో 14 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. మరో 17 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. తాజాగా వీరికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని