‘దిగులొద్దు మీ పామాయిల్‌ మేం కొంటాం’

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి తన దుర్బుద్ధి ప్రదర్శించారు. మలేషియా నుంచి పామాయిల్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. తాము ఆ దేశం నుంచి వీలైనంత ఎక్కువ పామాయిల్‌ దిగుమతి చేసుకునేందుకు కృషి చేస్తామని ఖాన్‌ మంగళవారం వెల్లడించారు.

Updated : 04 Feb 2020 21:47 IST

మలేషియాకు పాక్‌ ప్రధాని హామీ

కౌలాలంపూర్‌: మలేషియా నుంచి పామాయిల్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. తాము ఆ దేశం నుంచి వీలైనంత ఎక్కువ పామాయిల్‌ దిగుమతి చేసుకునేందుకు కృషి చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వెల్లడించారు. మంగళవారం మలేషియా పర్యటనలో ఉన్న ఖాన్‌ పామాయిల్‌ దిగుమతి గురించి ఆ దేశ ప్రధాని మహతీర్‌ మహ్మద్‌తో చర్చించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చర్చల అనంతరం ఖాన్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు భారత్ ఆ దేశపు పామాయిల్‌ దిగుమతులపై ఆంక్షలు విధించిందన్నారు. కానీ పాకిస్థాన్‌ ఆ దేశానికి కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలైనంత కృషి చేస్తుందని చెప్పారు. పలు విషయాల్లో తమకు మద్దతుగా మాట్లాడినందుకు తాము మలేషియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఇటీవల మలేషియాలో నిర్వహించిన ముస్లిం దేశాల సదస్సుకు హాజరు కాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ గతేడాది మలేషియా నుంచి 1.1 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ దిగుమతి చేసుకోగా, భారత్‌ 4.4మిలియన్‌ టన్నులు కొనుగోలు చేసింది. 

కొద్దిరోజుల కిందట మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ భారత అంతర్గత విషయాలైన కశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 రద్దు గురించి, సీఏఏ గురించి ఐరాస సర్వసభ్య సమావేశంలో చర్చించారు. దీనికి నిరసగా భారత్ మలేషియా నుంచి పామాయిల్‌ దిగుమతులపై ఆంక్షలు విధించింది. మలేషియా నుంచి పామాయిల్‌ కొనుగోలు చేయరాదని వ్యాపారులను ఆదేశించింది. మలేషియాకు అతిపెద్ద పామాయిల్‌ దిగుమతిదారు భారత్‌ కావడం గమనార్హం. ఈ పరిణామాలు ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని